![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 05:55 PM
తెలంగాణలో రహదారుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే ఉన్న రహదారులను విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. కొత్తగా రోడ్ల నిర్మాణం కూడా చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలను కలుపుతూ డబులు రోడ్లు నిర్మిస్తామని రేవంత్ సర్కార్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా డబుల్ రోడ్డు నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రిక్వెస్ట్‌కు స్పందించిన సీఎం రేవంత్ వెంటనే నిధులు కూడా మంజురూ చేశారు.
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దుబ్బాకలో యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రేవంత్‌రెడ్డి.. అక్కడ వర్సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్థల పరిశీలనకు దుబ్బాక వెళ్లాలని సీఎంవో అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా హబ్సీపూర్-లచ్చపేట్ మధ్య ఎప్పట్నుంచో డబుల్ రోడ్డు నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. దీనిపై కూడా సీఎంతో చర్చించారు. అక్కడ డబుల్ రోడ్డు నిర్మాణం చేపడితే చాలా పల్లెలలకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుందని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి డబుల్ రోడ్డు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు రూ.35 కోట్లు నిధులు మంజూరు చేశారు. హామ్ మోడల్‌లో ఆ రోడ్డును అభివృద్ధి చేస్తామని అధికారులు తెలిపారు. తాము అడిగిన వెంటనే స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డికి దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
కాగా,గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులను హామ్ విధానంలో నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ఆ రహదారులకు ట్యాక్స్ వసూలు చేయబోమని అన్నారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి మండలం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు వేయనున్నట్లు చెప్పారు. రహదారుల ద్వారానే అభివృద్ధి జరుగుతుందని.. రోడ్ల విస్తరణపై తమ ప్రభుత్వ స్పెషల్ ఫోకస్ పెట్టిందని వెల్లడించారు.