![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 03:36 PM
తెలుగు రాష్ట్రాల్లో భాణుడి భగభగలు జనాలను హడలెత్తిస్తున్నాయి. కేవలం మార్చి నెలలోనే ఎండలు ఠారెత్తిస్తుంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి తీవ్రంగా ఉండనుంది.అయితే ఎండల నుంచి కాస్త రిలీఫ్ చెందే వార్త వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్య చత్తీస్గడ్ దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం బలహీనపడింది. దక్షిణ ఛత్తీస్గడ్ నుండి అంతర్గత మహారాష్ట్ర, అంతర్గత కర్ణాటక మీదుగా అంతర్గత తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో గత రెండు రోజులతో పోల్చితే రాగల మూడు రోజులు స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని అన్ని జిల్లాలలో 38 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.సోమవారం గరిష్టంగా ఆదిలాబాద్ లో 41.8 కనిష్టంగా నల్లగొండ లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదివారం తెలంగాణ లోని భద్రాచలం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, ఖమ్మం, రామగుండం, నల్లగొండ, హనుమకొండ లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనాయి. భద్రాచలం..40.4, ఆదిలాబాద్..40.3, మహబూబ్ నగర్..39.9, మెదక్..39.6, నిజామాబాద్..39.5, హైదరాబాద్..38.8, ఖమ్మం..38.6, రామగుండం..38.6, నల్లగొండ..38.5, హనుమకొండ..38.4 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.