![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 01:54 PM
నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమల పెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో (SLBC Tunnel) సహాయక చర్యలు 36వ రోజుకు చేరుకున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు నిర్విరామంగా కృషిచేస్తున్నాయి. ప్రమాదం జరిగి 36 రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ఇద్దరు ఇంజనీర్ల మృతదేహాలు మాత్రమే లభించాయి. మిగిలిన ఆరుగురి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోజు మాదిరిగానే శనివారం ఉదయం సైతం ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్, సింగరేణి, ఆర్మీ, కేరళ పోలీస్ క్యాడవార్ డాగ్స్ వంటి రిస్క్యూ టీంలు సహాయ చర్యలు చేపట్టేందుకు సొరంగంలోకి వెళ్లాయి. ఇంత శ్రమిస్తున్న శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదన్న ఆవేదనతో అధికారులు, రెస్క్యూ బృందాలు, కార్మికులు ఉన్నారు. సొరంగంలోకి ఉబికి వస్తున్న నీటి ఊటను నిలువరిస్తే తప్ప సహాయక చర్యలు ముందుకు సాగవనేది రెస్క్యూ బృందాలు చర్చించుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రత్యేక అధికారి శివశంకర్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ సలహాలు సూచనలు చేస్తూ అత్యాధునిక పరికరాలతో సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను బయటకు తేలేకపోతున్నారు.