![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 05:59 PM
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విధానాలు, వాటి అమలుకు సంబంధించిన వివాదాలపై ఇటీవల ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చాయి. రాష్ట్రంలో రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తుండగా.. దీనిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.
మొత్తం రుణమాఫీ చేశామని ఎన్నోసార్లు చెప్పాం.. అయినా ఈ వాదనలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రైతు రుణమాఫీ పథకం ఎంత మందికి వర్తించింది.. ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది అనే వివరాలను ఊరూరా ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు పూర్తి వివరాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ వివరాలను పలు పద్ధతుల్లో ప్రజలకు చేరవేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏ రైతులకు ఎంత రుణం మాఫీ అయింది.. వాటి అమలుపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందనే వివరాలను ప్రజలకు పరోక్షంగా అందించేందుకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడమే కాకుండా.. ఆ వివరాలు పెన్‌డ్రైవ్‌లో వేసి సభ్యులకు పంపిస్తామన్నారు. రైతులు కూడా ఫ్లెక్సీలపై ఎవరికి రుణమాఫీ అయిందో లేదో తెలుసుకోవచ్చన్నారు.
విపక్షాలు.. ఈ రుణమాఫీ విధానం అమలుపై ఎప్పుడూ విమర్శలు చేసే అవకాశాలు కల్పించకుండా.. రుణమాఫీకి సంబంధించి ప్రతీ అంశాన్ని వారికి అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన రుణమాఫీ కంటే కూడా మేము బెటర్‌గా చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండలిలో పేర్కొన్నారు. అంతే కాకుండా.. ప్రతీ నియోజక వర్గంలో అర్హులైన రైతులకు రుణ మాఫీ చేశామన్నారు.
ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం..
గురువారం శాసనసభ మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించింది. ఆ బిల్లుపై సభ్యులు చర్చించి.. డిప్యూటీ సీఎం ప్రసంగించిన అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మనం పారదర్శకంగా మాట్లాడాలని.. ప్రతీ విషయం ప్రజలకు సుస్పష్టంగా తెలిపే దిశగా అడుగులు వేస్తున్నామని భట్టి విక్రమార్క తన ప్రసంగంలో పేర్కొన్నారు. మున్ముందు తెలంగాణ రైజింగ్ ఏ స్థాయిలో ఉంటుందో మీరే చూస్తారని డిప్యూటీ సీఎం అన్నారు. ఇక.. మండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. ద్రవ్య వినిమయ బిల్లు అనంతరం మండలిని నిరవధికంగా వాయిదా వేశారు.