|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 11:06 AM
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం, బాచుపల్లి గ్రామంలోని మేడికుంట ఆక్రమణలకు హైడ్రా చెక్ పెట్టింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిని ఆక్రమించి ప్రధాన రహదారివైపు వేసిన దుకాణాలను శనివారం హైడ్రా తొలగించింది. మొత్తం 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు ఆక్రమణలకు గురై 18 ఎకరాలకు పరిమితమవ్వగా.. ఉన్న చెరువును కూడా పక్కనే దుకాణాలు పెట్టి కలుషితం చేస్తున్నారని హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు అందింది. మాంసం, చికెన్ , చేపల దుకాణాలతో వ్యర్థాలను చెరువులోకి వదిలి కలుషితం చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులతో హైడ్రా క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. ఎఫ్‌టీఎల్ ఆక్రమణలను నిర్ధారించుకుంది. ఈమేరకు అక్కడ 10 దుకాణాల వరకూ ఖాళీ చేయించింది. పెద్ద మొత్తంలో చెరువు ఒడ్డున పడేసిన మాంసం వ్యర్థాలను హైడ్రా తొలగించింది. చెత్తను వేయడానికి వీలు లేకుండా.. 10 మీటర్ల ఎత్తులో హైడ్రా ఫెన్సింగ్ వేసింది. అక్కడ చెత్తను టిప్పర్లతో హైడ్రా తొలగించగా.. అదే ప్రాంతంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు మున్సిపల్ అధికారులు సన్నాహం చేస్తున్నారు. చెరువు ఆక్రమణలు తొలగి ప్రజావినియోగంలోకి రావడం పట్ల స్థానికలు హర్షం వ్యక్తం చేశారు.