|
|
by Suryaa Desk | Tue, Feb 17, 2026, 03:56 PM
దేశ రాజధానిలోని భారత్ మండపంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో అనూహ్య ఘటన వెలుగుచూసింది. ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలు హాజరైన ఈ వేదికపై, ఒక స్టార్టప్ కంపెనీకి చెందిన అత్యాధునిక ఏఐ పరికరాలు చోరీకి గురయ్యాయి. ఈ సంఘటన భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. వివరాల్లోకి వెళ్ళితే... బెంగళూరుకు చెందిన ‘నియోసాపియన్’ అనే ఏఐ స్టార్టప్ ప్రతినిధులు ఈ సదస్సులో తమ ఆవిష్కరణలను ప్రదర్శించడానికి వచ్చారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగ్జిబిషన్ ఏరియాను సందర్శించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటలకే స్టాల్స్ ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేయాలని భద్రతా సిబ్బంది ఆదేశించారు.తన కంపెనీ రూపొందించిన 'ఏఐ వేరబుల్' పరికరాలను వెంట తీసుకెళతానని కంపెనీ సీఈఓ ధనంజయ్ యాదవ్ కోరగా, అక్కడ భద్రతకు ఏ డోకా ఉండదని సిబ్బంది భరోసా ఇచ్చారు. అందరూ ల్యాప్‌టాప్‌లు కూడా అక్కడే వదిలి వెళుతున్నారని చెప్పారు. ప్రధాని పర్యటన ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు ధనంజయ్ తన స్టాల్‌కు వచ్చి చూడగా, పరికరాలు ఉన్న పెట్టెలు ఖాళీగా కనిపించాయి. అత్యంత విలువైన ఏఐ పరికరాలు మాయమవడంతో ఆయన విస్మయానికి గురయ్యారు.ఈ చేదు అనుభవాన్ని ధనంజయ్ యాదవ్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ‘‘హై-సెక్యూరిటీ జోన్ కావడంతో ఆ సమయంలో కేవలం భద్రతా సిబ్బందికి, అధికారిక బృందాలకు మాత్రమే అక్కడికి వెళ్లే అనుమతి ఉంది. మరి అంతటి కట్టుదిట్టమైన భద్రత మధ్య దొంగతనం ఎలా జరిగింది?’’ అని ఆయన ప్రశ్నించారు.