by Suryaa Desk | Sun, Jan 19, 2025, 07:18 PM
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అటు ఏపీలో.. ఇటు తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య జోరుగా విమర్శల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో అయితే.. కేసులు, అరెస్టులు, విచారణలో హాట్ హాట్‌గా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ ప్రముఖులను ఒకే ఫ్లెక్సీలో పెట్టి.. జాతరలో గత్తర లేపాడు ఓ వ్యక్తి. తన అభిమాన నాయకుల ఫొటోలను ముద్రించాడేమో అనుకుంటే.. ఆ ఫొటోలకు తనదైనశైలిలో క్యాప్షన్లు పెట్టటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఆసక్తికకర సన్నివేశం.. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని గట్టు మైసమ్మ జాతరలో కనిపించింది.
జాతర సందర్భంగా.. పలువురు కార్యకర్తలు తమ అభిమాన నేతలకు సంబంధించిన ఫ్లైక్సీలు పెట్టటం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయతీ. అందులో భాగంగానే.. ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జాతరకు వెళ్లే రోడ్డువెంట ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫొటో, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫొటోతో పాటు.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫొటోలు కూడా ముద్రించారు. అయితే.. వీళ్ల ఫొటోలన్ని ఒకే ఫ్లెక్సీలో ఉండటమే ఓ వింత అంటే.. ఆ ఫొటోల కింద రాసిన క్యాప్షన్లు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
అయితే.. చంద్రబాబు ఫొటో కింద బాస్ ఈజ్ బ్యాక్ అని క్యాప్షన్ పెట్టగా.. పవన్ కళ్యాణ్ ఫొటో కింద ట్రెండ్ సెట్టర్ అని, కేసీఆర్‌కు గాడ్ ఆఫ్ తెలంగాణ కమింగ్ సూన్ అని.. కేటీఆర్‌కు మాత్రం ఫ్యూచర్ తెలంగాణ అంటూ.. ముద్రించాడు. కాగా.. ఈ ఫ్లెక్సీలో వీళ్ల నలుగురు ఫొటోలే కాదు.. ఏపీ మాజీ సీఎం, దివంగత నేత ఎన్టీఆర్, దేవేందర్ గౌడ్, మంత్రి నారా లోకేష్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి ఫొటోను కూడా పెట్టారు. ఇక.. తెలంగాణ మాస్ లీడర్ అయిన హరీష్ రావు ఫొటో కూడా పెట్టటం గమనార్హం.
ఇలా రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలందరినీ ఒకే ఫ్లెక్సీలో ముద్రించడం చూసి.. జాతరకు వస్తున్న భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. ఇదేక్కడి మాస్‌రా మావా అని కొందరు, జాతరలో గత్తర లేపావుగా.. అని మరికొందరు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవలే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వెంకటాపురంలో ఏపీ సీఎం చంద్రబాబు, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయటం వైరల్ మారిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు ఘట్‌కేసర్ జాతరలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.