|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 02:58 PM
నమ్మిన సిద్ధాంతం కోసం అడవి బాట పట్టిన 38 మంది మావోయిస్టుల పేర్లను తెలంగాణ పోలీసులు తమ 'వాంటెడ్' జాబితా నుంచి తొలగించడం పెను సంచలనంగా మారింది. వారు బతికే ఉన్నారా లేక కాలగర్భంలో కలిసిపోయారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ అనూహ్య పరిణామం తమ వారు ఏదో ఒకరోజు తిరిగి వస్తారని ఆశగా ఎదురుచూస్తున్న కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నింపుతోంది.గతేడాది వరకు తెలంగాణకు చెందిన 55 మంది మావోయిస్టులు అడవుల్లో క్రియాశీలకంగా ఉన్నారని చెప్పిన పోలీసులు, తాజాగా ఆ సంఖ్యను కేవలం 11కి తగ్గించడం గమనార్హం. ఈ విషయంపై డీజీపీ శివధర్ రెడ్డి స్పందిస్తూ ఇటీవల లొంగిపోయిన అగ్రనేతలను విచారించినప్పుడు ఈ 38 మంది గురించి ఎలాంటి సమాచారం లభించలేదని తెలిపారు. వారు చాలాకాలం క్రితమే పార్టీని వీడి ఉండవచ్చని లేదా మారుపేర్లతో ఎక్కడో రహస్యంగా జీవిస్తూ ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. అందుకే వారిని జాబితా నుంచి తొలగించామని స్పష్టం చేశారు.