|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 03:15 PM
ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ నేతృత్వంలోని ఫిన్‌టెక్ కంపెనీ 'బ్లాక్' ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విజృంభిస్తున్న నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏఐ టూల్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తమ కంపెనీలోని 4,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది కంపెనీ మొత్తం సిబ్బందిలో దాదాపు సగం కావడం గమనార్హం. ఈ భారీ తొలగింపులపై జాక్ డోర్సీ స్వయంగా స్పందించారు. ఇది తమ కంపెనీ చరిత్రలోనే అత్యంత కఠినమైన నిర్ణయాల్లో ఒకటని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పేర్కొన్నారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్.. ఒక కంపెనీని నడపడం అనే తీరునే మార్చేశాయి. తక్కువ మంది సిబ్బందితో కూడిన బృందం ఈ టూల్స్‌ను ఉపయోగించి మరింత వేగంగా, మెరుగ్గా పనిచేయగలదు. ఈ మార్పును మేం ఇప్పటికే మా కంపెనీలో గమనిస్తున్నాం" అని ఆయన తన ప్రకటనలో వివరించారు.అయితే, కంపెనీ ఆర్థికంగా కష్టాల్లో వుండి, ఈ నిర్ణయం తీసుకోలేదని డోర్సీ స్పష్టం చేశారు. "మా వ్యాపారం బలంగా ఉంది. స్థూల లాభం నిరంతరం పెరుగుతోంది, కస్టమర్ల సంఖ్య కూడా అధికమవుతోంది, లాభదాయకత మెరుగుపడుతోంది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. మేం ఉపయోగిస్తున్న ఇంటెలిజెన్స్ టూల్స్, చిన్న బృందాలతో కలిసి కొత్త పని విధానాన్ని సృష్టిస్తున్నాయి. ఇది చాలా వేగంగా విస్తరిస్తోంది" అని ఆయన తెలిపారు.