|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 07:54 PM
శారదా పీఠం భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోకాపేటలోని భూములను శారదాపీఠానికే కేటాయించింది. జలమండలికి ఇచ్చిన భూములను ప్రభుత్వం రద్దుచేసింది. శారదాపీఠం నిర్మాణాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా సరైన వివరాలు ఇవ్వలేదని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్‌బాబును కలిసి వివరాలు ఇవ్వాలని పీఠం ప్రతినిధులకు సీఎం రేవంత్ సూచించారు. శారదా పీఠం భూముల వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. శారదా పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో గండిపేట మండలం కోకాపేట నియోపోలీస్‌లో విశాఖ శారదా పీఠానికి భూములను కేటాయించారు. ఈ భూములను ప్రస్తుతం ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోడానికి సిద్ధమవుతుందని హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కోకాపేట సర్వే నంబర్ 240లో రెండు ఎకరాల భూమిని శారదా పీఠానికి 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. వేద పాఠశాల, రాజశ్యామల అమ్మవారి ఆలయం, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు అత్యంత విలువైన ఈ భూమిని ఎకరాకు ఒక్క రూపాయి చొప్పున నామమాత్రపు ధరకే ప్రభుత్వం అప్పగించింది. వందల కోట్ల విలువైన భూములను ఉచితంగా ఇవ్వడంపై అప్పట్లోనే దుమారం రేగింది. దీనిపై హైకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ భూమిలో ఆలయ నిర్మాణం పూర్తిచేసి, అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని అప్పట్లో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. అంతేకాదు, తన శేష జీవితాన్ని కూడా ఇక్కడే గడుపుతానని పేర్కొన్నారు.
ఈ భూముల సమీపంలోనే జలమండలికి కేటాయించడంతో వివాదం మొదలైంది. ఇప్పటికే అక్కడ నిర్మాణాలు కొంత మేర జరగడంతో ఈ అంశంపై సీఎం శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శారదా పీఠం భూముల విషయంలో సరైన సమాచారం ఎందుకు ఇవ్వలేదని అధికారులను నిలదీశారు.
కోకాపేట నియోపోలిస్‌లో జలమండలికి అదనంగా 3.95 ఎకరాల భూ కేటాయింపులతో వివాదం మొదలైంది. ఇప్పటికే అక్కడ 8.75 ఎకరాలు ఎంబీఆర్, ఈఎల్ఎస్ఆర్‌ల నిర్మాణానికే సరిపోతాయని, ఓహెచ్‌టీ, సైట్ ఆఫీస్, మెయింటెనెన్స్ కోసం అదనపు భూమి అవసరమని ప్రభుత్వాన్ని జలమండలి అభ్యర్థించింది. 592 మీటర్ల కంటే ఎత్తులో ఉండటం వల్ల గ్రావిటీ ద్వారా నీటి సరఫరా చేయవచ్చని ప్రభుత్వం భావించింది. పంపింగ్ అవసరం లేకుండా ఆ పరిసర ప్రాంతాల ప్రజలకు నీటి సరఫరా చేయవచ్చని తెలిపింది, బోజగుట్ట రిజర్వాయర్‌కు గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా తరలించి, అక్కడ ననుంచి ఓల్డ్ సిటీ, షేక్‌పేట్, రెడ్ హిల్స్, మెహిదీపట్నం ప్రాంతాలకు తాగునీటిని అందజేయవచ్చిన పేర్కొంది.