|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 02:10 PM
ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ పరిణామంపై అమెరికా, ఇరాన్ పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. తమ నాయకుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ శపథం చేయగా, ఇరాన్ దుశ్చర్యల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అమెరికా వాదిస్తోంది.శనివారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ ఇరాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్ గతంలోనే కుట్ర చేసిందని సంచలన ఆరోపణ చేశారు. "గత 47 ఏళ్లుగా ఇరాన్ ప్రపంచవ్యాప్తంగా రక్తపాతానికి కారణమవుతోంది. తన అనుచర వర్గాల ద్వారా మా స్థావరాలపై దాడులు చేస్తోంది. అందుకే అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఇజ్రాయెల్‌తో కలిసి ఈ సైనిక చర్య చేపట్టాం" అని ఆయన స్పష్టం చేశారు. ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.