|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 03:18 PM
ఇరాన్ పై ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న హైదరాబాద్‌కు చెందిన సుమారు 900 మంది విద్యార్థులు ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ప్రధానంగా టెహ్రాన్, కుమ్ వంటి నగరాల్లో ఎంబీబీఎస్, ఇతర ఉన్నత చదువుల కోసం వెళ్ళిన విద్యార్థులు యుద్ధం మధ్యలో చిక్కుకుపోయారు.హైదరాబాద్‌లోని పాతబస్తీ, టోలీచౌకి, నాంపల్లి వంటి ప్రాంతాల నుంచి వెళ్ళిన విద్యార్థుల ఆచూకీ తెలియక వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యుద్ధం కారణంగా ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు మొబైల్ నెట్‌వర్క్‌పై కూడా ఆంక్షలు విధించింది. దీంతో గత 24 గంటలుగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు అందుబాటులోకి రాలేకపోతున్నారు. ‘‘మా పిల్లల ఫోన్లు కలవడం లేదు.. వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో తెలియక ఆందోళన చెందుతున్నాం’’ అంటూ పలువురు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.