|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 03:51 PM
రాష్ట్రంలో సుమారు 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారని, వారంతా కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా ఏళ్లుగా జీతాలు తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 1.70 లక్షల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఈ నకిలీ ఉద్యోగులను గుర్తించినట్లు తెలిపారు. ఇలాంటి బోగస్ ఉద్యోగులను సృష్టించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలపై సమగ్ర ఆడిట్ చేయించి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆయన తీవ్రంగా ఆదేశించారు. కలెక్టర్లు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమాన్ని అమలు చేయడంపై ఆయన దిశానిర్దేశం చేశారు. గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల భాగస్వామ్యంతో ఈ ప్రణాళికను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఈ నెల 12న జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించనున్నట్లు తెలిపారు.