by Suryaa Desk | Sun, Nov 03, 2024, 09:36 PM
భారత సైన్యంలో పనిచేసి రిటైర్డ్ అయిన సైనికాధికారుల కుమార్తెల వివాహాలకు తెలంగాణ ప్రభుత్వం గతంలో అందిస్తున్న రూ.40 వేల ఆర్థిక సాయాన్ని తాజాగా పెంచింది. ఆ సాయాన్ని రూ.50 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటుగా ఆ పథకానికి 'కల్యాణ కానుక'గా కొత్త పేరు పెట్టారు. శనివారం (నవంబర్ 2) రాజ్‌భవన్ వేదికగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేతృత్వంలో ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్‌డే ఫండ్ రాష్ట్ర నిర్వాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విశ్రాంత సైనికాధికారుల కుటుంబాల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
విశ్రాంత సైనికులు, వారి కుటుంబాలకు అందజేస్తున్న వివిధ రకాల సంక్షేమ నిధులను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. విశ్రాంత సైనికాధికారుల కుమార్తెల వివాహాలకు ప్రస్తుతం రూ.40 వేలు అందిస్తుండగా.. ఆ మెుత్తాన్ని రూ.50 వేలకు పెంచారు. అలాగే రిటైర్డ్ సైనికులు మృతిచెందితే అంత్యక్రియలకు ప్రస్తుతం రూ.10 వేలు అందిస్తుండగా.. ఆ మెుత్తాన్ని తాజాగా రూ.20 వేలకు పెంచారు. అవివాహిత సైనికులు సర్వీసులో మరణిస్తే తల్లిదండ్రులకు రూ.3 లక్షలు అందజేయనున్నారు. వివాహితులు మరణిస్తే తల్లిదండ్రులకు రూ.2.5 లక్షలు, వారి భార్యకు రూ.3 లక్షల అందజేయనున్నారు.
ఇంటర్, ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థుల హాస్టల్ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను కూడా పెంచారు. ప్రస్తుతం ఏడాదికి రూ.10 వేల ఇస్తుండగా.. దాన్ని రూ.20 వేలకు పెంచారు. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ఇస్తున్న ఆర్థిక సాయం రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. విశ్రాంత సైనికులకు 15 ఏళ్లలోపు ప్రత్యేక అవసరాలున్న పిల్లలున్నట్లయితే.. వారికి ప్రతినెలా అందిస్తున్న ఆర్థికసాయం రూ.6 వేలకు పెంచారు. పదిహేనేళ్లు దాటిన వారికి రూ.9 వేలు అందించనున్నారు. అవయవ మార్పిడికి రూ.2 లక్షల సాయం. కరీంనగర్, వరంగల్‌లలో సైనిక భవనాల మరమ్మతులకు రూ.40 లక్షల మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. సైనికుల కోసం తెలంగాణ ప్రభుత్వం పలు వినూత్న కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని కొనియాడారు. విశ్రాంత సైనికుల రికార్డులన్నీ డిజిటలైజ్ చేసిందని చెప్పారు. నిధులన్నీ వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తోందని కితాబిచ్చారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా ఐపీఎస్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఐఏఎస్ తదితరులు పాల్గొన్నారు.