|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 12:45 PM
వేద మంత్రోచ్ఛరణలు,మంగళ వాయిద్యాల మధ్య.. ముక్కోటి దేవతల సాక్షిగా లోక కళ్యాణార్థం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు శ్రీ స్వామివారికి శ్రీ అమ్మవారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు,తెలంగాణ ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య,ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు,కలెక్టర్ హనుమంతరావు గారు,జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్,అదనపు కలెక్టర్ భాస్కరరావు,మున్సిపల్ చైర్మన్ గుండ్ల పల్లి వాణి భరత్ గౌడ్ దంపతులు తదితరులు హాజరయ్యారు.కళ్యాణ తంతు విశ్వక్సేనుడి పూజతో ప్రారంభమై.. తలపై జీలకర్ర బెల్లం,మాంగల్య ధారణ,తలంబ్రాలుగా కొనసాగాయి.లోకకళ్యాణార్థం శ్రీ స్వామి వారు శ్రీ అమ్మవారి మెడలో మాంగల్య ధారణ చేశారు.కనుల పండువగా జరిగిన ఈ బ్రహ్మోత్సవ కళ్యాణంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.టెలివిజన్లలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా కోట్లాదిమంది భక్తులు వీక్షించారు.