|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 11:03 PM
హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీ వెహికల్ బయటకు తీశారా.. ఇక అంతే సంగతులు. మీ బైక్ లేదా కార్ సీజ్ కావటం ఖాయం. ఎందుకంటే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ లేకుండా వెహికల్స్ నడిపే వారిపై కఠిన చర్యలకు రంగం సిద్ధమైంది. నేటి (మార్చి 1) నుంచి నగర పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ నడిపితే వారి వాహనం సీజ్ చేయనున్నారు.
అనంతరం వారికి స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్, ఎల్‌ఎల్‌ఆర్ తీసుకునేందుకు తగినంత సమయం కూడా ఇస్తారు. తర్వాత కోర్టులో ఫైన్ చెల్లించి వాహనం తీసుకెళ్లవచ్చు. లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇచ్చే యజమానులపైనా కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ జాయింట్ సీపీ హెచ్చరించారు. వాహనదారులు విధిగా డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర పెట్టుకోవాలని సూచించారు. లేదంటే వాహనాలు సీజ్, ఫైన్ వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారికి నేటి నుంచి (మార్చి 1) అదనపు భారం పడనుంది. రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, రహదారి భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం 'రోడ్డు సేఫ్టీ సెస్' పేరుతో కొత్త పన్నును అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మేరకు రవాణా శాఖ ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనాలు కొత్తగా కొనుగోలు చేస్తే రూ. 2 వేలు అదనంగా చెల్లించాలి. ఫోర్ వీలర్లు రూ. 5వేలు, భారీవాహనాలు, ప్రైవేట్ వాహనాలకు రూ. 10 వేల వరకు పన్ను పడుతుంది. ఈ సెస్‌ను వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే వన్-టైమ్ పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ. 300 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నిధులను కేవలం రోడ్డు భద్రత కోసమే వినియోగించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. దీని ద్వారా ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్లను సరిచేయడం, ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించడం, అత్యవసర వైద్య సేవలను మెరుగుపరచడం వంటి పనులు చేపట్టనున్నారు.