|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 07:34 AM
ఇజ్రాయెల్, అమెరికాతో ఇరాన్ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్ వాసులు ఆ దేశంతో తమకున్న శతాబ్దాల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. భాగ్యనగర రూపశిల్పి మొదలుకొని, నగరాన్ని నిర్మించిన పాలకులు కూడా నాటి పర్షియా నుంచి వచ్చినవారే కావడంతో ఈ చారిత్రక బంధంపై మరోసారి ఆసక్తి నెలకొంది.హైదరాబాద్ నగరాన్ని 1591లో నిర్మించిన మహమ్మద్ కులీకుతుబ్ షా కొలువులో ప్రధానిగా పనిచేసిన మీర్ మోమిన్ అస్త్రాబాదీ ఇరాన్‌కు చెందినవారే. ఆయన పర్యవేక్షణలోనే హైదరాబాద్ నగరం అద్భుతమైన కట్టడాలు, ఉద్యానవనాలతో రూపుదిద్దుకుంది. ఈ కారణంగానే గోల్కొండ కోట, చార్మినార్, కుతుబ్‌షాహీల సమాధుల వంటి అనేక వారసత్వ కట్టడాల్లో పర్షియన్ వాస్తు శైలి నేటికీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కుతుబ్‌షాహీలు, ఆ తర్వాత పాలించిన నిజాంలు కూడా ఇరాన్ నుంచి వలస వచ్చినవారే.ఈ బంధం కేవలం కట్టడాలకే పరిమితం కాలేదు. మనం ఇష్టంగా తినే బిర్యానీ, హలీం, తాగే ఇరానీ చాయ్ వంటివి పర్షియా నుంచి వచ్చినవే. 20వ శతాబ్దంలో ఇక్కడికి వలస వచ్చిన ఇరానీయులు ఏర్పాటు చేసిన కేఫ్‌లు నగర సంస్కృతిలో భాగమయ్యాయి. దర్వాజ, ఖర్చు, దావత్ వంటి ఎన్నో పర్షియన్ పదాలు తెలుగు, ఉర్దూ భాషల్లో కలిసిపోయాయి.వర్తమానంలోనూ ఇరు ప్రాంతాల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఔషధాలు ఎగుమతి అవుతుండగా, ఇరాన్ నుంచి కార్పెట్లు, డ్రైఫ్రూట్స్ దిగుమతి అవుతున్నాయి. ఈ స్నేహానికి గుర్తుగా పాతబస్తీలో 'ఇరానీ గల్లీ', బంజారాహిల్స్‌లోని ఇరాన్ కాన్సులేట్ ఉన్న రోడ్డుకు ఆ దేశ వ్యవస్థాపకుడు 'ఖమేనీ' పేరు పెట్టారు. తాజాగా ఇరాన్‌పై దాడులకు వ్యతిరేకంగా పాతనగరంలో నిరసన ర్యాలీ జరగడం ఈ అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసింది.