by Suryaa Desk | Sat, Nov 02, 2024, 02:47 PM
తెలంగాణలో ఈ నెల 6వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే పనిచేయనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఆయా స్కూళ్ల టీచర్లు మూడు వారాలపాటు కుల గణనలో పాల్గొంటారని, కాబట్టి ప్రాథమిక పాఠశాలలు మధ్యాహ్నం వరకే పనిచేస్తాయని పేర్కొంది. పాఠశాలలు ఒంటి గంట వరకే పనిచేసినా షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాల్సిందేనని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 3,414 మంది ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సేవలను కుల గణనకు వినియోగించుకుంటున్నట్టు ప్రభుత్వ పేర్కొంది. అలాగే, 6,256 మంది ఎమ్మార్సీ సిబ్బంది, టైపిస్ట్ రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ క్యాడెర్‌లో ప్రభుత్వ, ఎంపీపీ, జడ్‌పీపీ, ఎయిడెడ్ స్కూళ్ల నుంచి దాదాపు 2 వేల మంది మినిస్టీరియల్ సిబ్బందిని సర్వేకు వినియోగించుకుంటున్నట్టు వివరించింది.స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి 50 వేల మంది ఉద్యోగులు, అకౌంటెంట్, ఏఎన్ఎం, పీఈటీ వంటి కేసీబీవీ, యూఆర్ఎస్ నుంచి బోధనేతర సిబ్బంది సహా ఇంటింటి సర్వేలో పాల్గొంటారని వివరించింది. ప్రణాళిక విభాగం ఆదేశాలకు అనుగుణంగా ఎస్జీటీ, పీఎస్‌హెచ్ఎంలు సెలవు దినాల్లో రోజంతా ఎన్యుమరేటర్ విధుల్లో పాల్గొనాలని ఆదేశించింది. అయితే, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌జీటీలను ఎన్యుమరేటర్ విధులకు దూరంగా ఉంచింది. దీంతో హైస్కూళ్లు మాత్రం యథావిధిగా నడుస్తాయి.