by Suryaa Desk | Wed, Jan 01, 2025, 07:37 PM
నూతన సంవత్సర వేడుకల్లో మద్యం ఏరులై పారింది. కిక్కుతో కొత్త ఏడాదికి స్వాగతం పలికి.. ఏకంగా రూ.403 కోట్ల మేర మద్యం తాగేశారు. హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ మొత్తం 1,184 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ జోన్‌లో అత్యధికంగా 236, సౌత్ ఈస్ట్ జోన్‌లో 192, వెస్ట్ జోన్‌లో 179, నార్త్ జోన్‌లో 177, సౌత్ వెస్ట్ జోన్‌లో 179 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. అత్యల్పంగా సెంట్రల్ జోన్‌లో 102 కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అయితే, డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల సందర్భంగా బ్రీత్ ఎనలైజర్ మిషన్ ద్వారా.. ఆల్కహాల్ శాతం ఎంతుందో తెలుసుకుంటారు.
మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే వారిని ఆపి బ్రీత్ ఎనలైజర్ ద్వారా తాగింది లేనిది పోలీసులు నిర్ధారిస్తారు. 100 మి.లీ రక్తంలో ఆల్కహల్ శాతం 30 మిల్లీ గ్రాములు దాటితే కేసు నమోదు చేస్తారు. 50 మి.గ్రాముల ఉంటే ఆ వ్యక్తి స్పృహాలో లేనట్లు గుర్తిస్తారు. బ్రీత్ అనలైజర్‌లో వందకు మించి రీడింగ్ నమోదైన సందర్భాలు లేకపోలేదు. కానీ, మంగళవారం రాత్రి పంజాగుట్ట సమీపంలో డ్రంకెన్ డ్రైవ్ సందర్భంగా చోటుచేసుకున్న సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. అటుగా బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపారు. అతడికి బ్రీత్ ఎనలైజర్ మిషన్ పెట్టి గాలి ఊదమన్నారు.
ఆ వ్యక్తి గాలి ఊదగానే మిషన్ షేకయ్యింది. కేవలం బ్రీత్ ఎనలైజర్ మిషన్ మాత్రమే కాదు.. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసుల కళ్లు కూడా బైర్లు కమ్మాయి. ఏకంగా 550 రీడింగ్ నమోదుకావడంతో అంతా షాకయ్యారు. డిసెంబర్ 31న రాత్రి 10.50 గంటల సమయంలో పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 వెంగళరావు పార్క్ సమీపంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఆ మార్గంలో TS09EK3617 అనే నెంబరు ఉన్న ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఆపి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు. అతడు ఉఫ్ మని ఊదగానే రీడింగ్ 550 దాటేయడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తి పేరు తెలియనప్పటికీ ఆ బైక్ మాత్రం రియాజుద్దీన్ అనే వ్యక్తి పేరుమీద ఉందని తెలిపారు. బైక్ సీజ్ చేసి.. కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు.
అయితే, ఈ బైక్ డిసెంబర్ 31న ఉదయం 9.17 గంటలకు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసిన కేసు నమోదైంది. అదే బైక్ రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడటం గమనార్హం. ఉదయం హెల్మెట్ లేకుండా బైక్ నడపటంతో అసిఫ్‌నగర్ ట్రాఫిక్ పోలీసుల ఫైన్ వేస్తే... రాత్రి పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులకు డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. ఇప్పటివరకూ ఈ బైక్‌పై పది ట్రాఫిక్ చలనాలు పెండింగ్ ఉండగా.. ఇవ్వన్నీ హెల్మెట్‌కు సంబంధించినవే.