by Suryaa Desk | Fri, Jan 03, 2025, 04:19 PM
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను భయాందోళనకు గురి చేసే కుట్ర చేస్తోదని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సొమ్మును రైతన్నలు మాత్రమే తింటున్నారన్న దుష్ప్రచారం ఆపాలని సూచించారు.ఇచ్చిన హామీలు అమలు చేసే సత్తా లేకుంటే.. రైతన్నలను క్షమాపణ అడగాలని డిమాండ్ చేశారు. అసలు రైతన్నల నుంచి ప్రమాణపత్రాలు ఎందుకు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.'ప్రమాణ పత్రం వేయాల్సింది రైతన్నలు కాదు. రైతన్నలకు హామీ ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే రైతన్నలకు ఇచ్చిన రైతు భరోసా పైన గ్రామ గ్రామాన లబ్ధిదారుల జాబితా పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో కౌలు రైతులకు, రైతు కూలీలకు ఏ విధంగా రైతుబంధు ఇచ్ఛారో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. మరొక్కసారి రైతు భరోసాకు దరఖాస్తు చేయాలి అంటూ డ్రామా మొదలుపెట్టారు' అని కేటీఆర్ విమర్శించారు.'అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే కాంగ్రెస్ ప్రజాపాలన - అభయ హస్తం పేరుతోనే.. ప్రజలందరి నుంచి దరఖాస్తులు తీసుకుంది. 6 గ్యారంటీల కోసం అని చెప్పి ప్రజలను ముప్పు తిప్పలు పెట్టి.. కోటి ఆరు లక్షల మంది దగ్గర దరఖాస్తులు తీసుకుంది. ప్రజలందరికీ సమాచారాన్ని సంపూర్ణంగా తీసుకుంది. ప్రతి దానికి దరఖాస్తుల పేరు చెప్పి కాంగ్రెస్ కాలయాపన చేస్తున్నది. గతంలో రైతులే శాసించేటట్టు మా ప్రభుత్వం తయారు చేస్తే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యాచించే స్థితికి తీసుకువచ్చింది' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
'మేము రైతును రాజుగా చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారిని బిచ్చగాళ్లుగా తయారుచేస్తుంది. ఇప్పుటి దాకా రైతుల నుంచి కొన్న పంట కొనుగోలు వివరాలు, ఇచ్చిన బోనస్ వివరాలను వివరాల జాబితాలను గ్రామాల్లో పెట్టాలి. రైతుబంధు పథకాన్ని మా ప్రభుత్వం తీసుకువస్తే.. మీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని బొంద పెట్టడానికి కుట్ర చేస్తుంది. అందుకే రైతు బంధులో రూ.22000 కోట్లు పక్కదారి పట్టాయని దుష్ప్రచారం చేస్తుంది' అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
'ఏ ఊర్లో ఎంత మేర రైతుబంధు దుర్వినియోగం అయిందో జాబితా ప్రచురించాలి. పత్తి రైతుకి, కంది రైతుకి, చెరుకు, పసుపు, పోడు భూముల రైతన్నలకు ఇచ్చిన రైతుబంధును.. దుబారా అయిందని అడ్డగోలుగా ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోంది. మరి ఈ రైతన్నలందరికీ ప్రమాణ పత్రాల పేరుతోనే రైతు భరోసా ఎగగోడతారా. రైతు బంధుమైన దుష్ప్రచారం చేస్తూ.. రద్దు చేసే కుట్రలో భాగంగానే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ప్రతి ఒక్క రైతన్న ప్రభుత్వానికి ఎందుకు ప్రమాణ మాత్రం ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని నిలదీయాలి' అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
'వరంగల్ రైతు డిక్లరేషన్ సంపూర్ణంగా అమలు చేయాలని ప్రభుత్వం పైన ఒత్తిడి చేద్దాం. రాష్ట్రంలోని 22 లక్షల కౌలు రైతాంగానికి రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు. రైతుబంధును, రైతు భరోసాను కుదించే కుట్రను మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. రేపటి నుంచి పలు రకాల కార్యక్రమాల రూపంలో రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యవంతం చేద్దాం. సంక్రాంతి లోగా రైతు భరోసాను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువద్దాం' అని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సూచించారు.'11 సీజన్లలో రూ.73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. 12వ సీజన్లో రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను ఆపింది కాంగ్రెస్. సంవత్సరం దాటిపోయినా ఈరోజు వరకు ఒక్క రూపాయి కూడా రైతన్నలకు ఇయ్యలేదు. ఆరోజు మేము దాచిపెట్టిన రూ.7500 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఎన్నికలకు ముందు వరంగల్లో రాహుల్ గాంధీని తెచ్చి రైతన్నలను ఉద్ధరిస్తామని చెప్పారు. రైతు డిక్లరేషన్‌లో భాగంగా ఎకరానికి రూ.15 వేలు, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఆర్థిక భరోసా ఇస్తామని ప్రకటించారు. ఇన్ని రకాల హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు రైతులతోనే ప్రమాణ పత్రాలు తీసుకుంటుంది' అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.