by Suryaa Desk | Fri, Jan 03, 2025, 08:47 PM
నాంపల్లిలో నుమాయిష్ సందడి మొదలైంది. ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే 84వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాల (నుమాయిష్)ను రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు.1938లో నిజాం కాలంలో మొదలైన నుమాయిష్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి సందర్శకులు వస్తారు. సందర్శకుల సౌకర్యార్థం ఎగ్జిబిషన్ సొసైటీ గాంధీభవన్, అజంతా, గోషామహల్ గేట్‌లను అందుబాటులో ఉంచింది. సీసీ కెమెరాలు, భద్రతా బలగాలతో పాటు.. సందర్శకులు మైదానంలో తిరిగేందుకు ఏర్పాట్లు చేశారు. జమ్మూకశ్మీర్ డ్రై ఫ్రూట్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ నుంచి హస్తకళ వస్తువులు ప్రదర్శనలో ఉంటాయి. దేశంలోని అత్యుత్తమ బ్రాండ్ల ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు అన్ని రకాల స్టాల్స్ అందుబాటులో ఉంటాయి. రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు, వారాంతాలు, సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.