by Suryaa Desk | Fri, Jan 03, 2025, 12:00 PM
నగర ప్రజలను అలరించేందుకు గాను నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) శుక్రవారం ప్రారంభం కానుంది.మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించడం, దీంతో జనవరి ఒకటో తేదీన ప్రారంభం కావాల్సిన నుమాయిష్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు. శుక్రవారం ప్రారంభోత్సవానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శనను ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, కార్యదర్శి బి.సురేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి డి.మోహన్, కోశాధికారి డాక్టర్ బి.ప్రభాశంకర్‌లు తెలిపారు. ఎగ్జిబిషన్ మైదానంలో స్టాళ్ల నిర్మాణ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి.ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ నిర్వహిస్తారు. ఈ సంవత్సరం 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు గాను స్టాళ్ల కేటాయింపు పూర్తి కాగా, నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. నుమాయిష్‌ను సందర్శించేందుకు గాను నగర నలుమూలల నుంచే కాకుండా పలు జిల్లాల నుంచి లక్షలాది మంది తరలి వస్తారు. గత సంవత్సరం దాదాపు 25 లక్షలకు పై చిలుకు సందర్శకులు ఎగ్జిబిషన్‌ను సందర్శించగా, ఈ సంవత్సరం మరింతగా సందర్శకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జిబిషన్ సందర్శనకు వచ్చే సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, కార్యదర్శి బి.సురేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి డి.మోహన్, కోశాధికారి డాక్టర్ బి.ప్రభాశంకర్‌లు తెలిపారు. ఎగ్జిబిషన్ సందర్భంగా సీసీ కెమెరాలు, వాలంటీర్లు, మెటల్ డిటెక్టర్లు, ప్రత్యేక సెక్యూర్టీ ద్వారా భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.నుమాయిష్ 84వ వసంతంలోకి అడుగు పెడుతుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్‌ను శుక్రవారం సాయంత్రం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌లతో పాటు పలువురు అధికార, అనధికార ప్రముఖులు ఈ ప్రారంభోత్సవానికి విచ్చేయనున్నారు.