by Suryaa Desk | Fri, Jan 03, 2025, 10:34 AM
పాతబస్తీ లో మెట్రో నిర్మాణానికి అవసరమైన క్షేత్రస్థాయి పనులను హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్), రెవెన్యూ అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రధానంగా మెట్రో ఏర్పాటు కోసం ఆస్తులు కోల్పోతున్న బాధితులకు పరిహారం అందించే కార్యక్రమాన్ని చివరి దశకు తీసుకొచ్చారు. సమ్మతి లేఖలు ఇచ్చిన వారికి ఈ నెల 7న హైదరాబాద్ కలెక్టరేట్‌లో పరిహారం చెక్కులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో దశ విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్(MGBS) నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పనులను రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా పరిగణిస్తోంది. రూ.2,741 కోట్లతో ఈ కారిడార్‌ను పూర్తి చేసేందుకు సిద్ధమైంది.దారుల్‌షిఫా, ఆలిజాకోట్ల, హరిబౌలి, మీర్ మోమిన్‌దైరా, లాల్‌దర్వాజా మోడ్, ఆలియాబాద్ జెండా, ఫలక్‌నుమా మీదుగా చేపడుతున్న నిర్మాణంలో 1,100 ఆస్తులు కోల్పోతున్నట్లు హెచ్‌ఏఎంల్ అధికారులు గతంలోనే ప్రకటించారు. వీటికి సంబంధించి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దశలవారీగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఆస్తులు కోల్పోతున్న వారికి గజానికి రూ.81 వేలు ఇస్తున్నట్లు ఇటీవల హెచ్‌ఏఎంఎల్, రెవెన్యూ అధికారులు ప్రకటించారు.