by Suryaa Desk | Fri, Jan 03, 2025, 02:44 PM
మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కళాశాలలో వసతిగృహ స్నానాల గదిలో వీడియోలు చిత్రీకరించారంటూ విద్యార్థినులు చేసిన ఆరోపణలపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. హాస్టల్ వార్డెన్ సహా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారి వేలిముద్రలను దర్యాప్తు బృందం సేకరించింది. మరోవైపు కళాశాలకు యాజమాన్యం మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది.వసతిగృహ స్నానాల గది వెంటిలేటర్ నుంచి తమను వీడియో తీశారంటూ మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కళాశాల ఐటీ క్యాంపస్ విద్యార్థినులు బుధవారం ఆందోళనకు దిగగా ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాలు, బీజేవైఎం నేతలు మద్దతు పలకడంతో గురువారం పరిస్థితి మరింత వేడెక్కింది. రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. యాజమాన్యానికి నోటీసు జారీ చేసింది. కమిషన్ కార్యదర్శి పద్మజారమణ వసతిగృహానికి వచ్చి విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు.