by Suryaa Desk | Thu, Jan 02, 2025, 02:46 PM
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గంలోనే సీఎం రేవంత్ రెడ్డి నడవక తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సూచించారు. మేడ్చల్, శామీర్‌పేట్ వరకు మెట్రో మార్గం పొడిగిస్తూ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో అది రుజువైందని పేర్కొన్నారు. మెట్రో విషయంలోనే కాదని, జలవనరులు, విద్యుత్ శాఖలోనూ కేసీఆర్ చూపిన మార్గంలో ముందుకు వెళ్లాల్సిందేనని వివేకానంద స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేపీ వివేకానంద మాట్లాడారు.మేడ్చల్, శామీర్‌పేట వరకు మెట్రో మార్గం పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం బీఆర్ఎస్ విజయమన్నారు. ఈ మార్గాల్లో పనులను మొదటి ప్రాధాన్యంగా పెట్టుకుని పూర్తి చేయాలన్నారు. ఇక మెట్రో పనులు ఎప్పటిలోపు పూర్తి చేస్తారో చెప్పాలని కేపీ డిమాండ్ చేశారు. రాయదుర్గం నుంచి శంషాబాద్‌కు ప్రారంభమైన మెట్రో పనులను రద్దు చేయడం సరికాదన్నారు. ఈ రూట్‌లో దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు తిరుగుతారని పేర్కొన్నారు. రాయదుర్గం – ఎయిర్‌పోర్టు మెట్రో పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ శాస్త్రీయంగా అధ్యయనం చేసి పనులు ప్రారంభించిన మెట్రో రూట్‌ను రద్దు చేయొద్దని ప్రతి సందర్భంలో ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్‌కు శంకుస్థాపన చేసి ఏడాది కావొస్తున్నా.. ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయలేదని కేపీ వివేకానంద విమర్శించారు.