|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 06:30 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటర్ స్టూడెంట్ పరీక్షా కేంద్రంలోని బాత్రూంలో ప్రసవించింది. చనిపోయిన బిడ్డ పుట్టడటంతో అక్కడే ఉన్న బేసిన్‌లో కుక్కేసి బయటకు వచ్చింది. అనుమానంతో ఇన్విజిలేటర్ వెళ్లి చూడగా.. వాష్‌రూంలో శిశువు మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తెలిపిన ప్రకారం... పాల్వంచలోని ఓ పరీక్షా కేంద్రానికి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల బాలిక ఇంగ్లిష్ ఎగ్జామ్ రాసేందుకు శుక్రవారం (ఫిబ్రవరి 27) రాయటానికి వచ్చింది. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. ఆ తర్వాత 30 నిమిషాలే లేడీ ఇన్విజిలేటర్ అనుమతితో పరీక్షా కేంద్రంలోని బాత్రూంలోకి వెళ్లింది. లోపలికి వెళ్లి అరగంటైనా రాకపోవటంతో లేడీ ఇన్విజిలేటర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ వెంటనే ఆమె మరుగుదొడ్ల వైపు చూసేందుకు వెళ్లింది. అయితే బాలిక చాలా మెళ్లిగా నడుచుకుంటూ ఇబ్బంది పడుతూ బయటకు వచ్చింది. ఏం జరిగిందని ఆరా తీయగా బాలిక సమాధానం చెప్పకుండా తల వంచుకొని అలాగే ఉండిపోయింది. అనుమానంతో బాలికను గట్టిగా వివరాలు ఆరా తీయగా అప్పుడు అసలు విషయం చెప్పింది.
తాను గర్భంతో ఉన్నానని.. నొప్పులు తట్టుకోలేక మరుగుదొడ్డికి వెళ్లి మృత శిశువుకు జన్మనిచ్చినట్లు ఇన్విజిలేటర్‌కు చెప్పంది. పరీక్షా కేంద్రంలోని సిబ్బంది వాష్ రూం లోపలికి వెళ్లి చూడగా.. బేసిన్‌లో మృత శిశువు కనిపించింది. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందనే భయంతోనే ఎవరికీ అనుమానం రాకుండా చనిపోయిన శిశువును బాత్‌రూం బేసిన్‌లో కుక్కినట్లు ఆ బాలిక తెలిసింది. దీంతో పరీక్షా కేంద్రం నిర్వాహకులు విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. పరీక్షా కేంద్రానికి వచ్చిన పోలీసులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. వాష్ రూంలోని మృత శిశువును 108 వాహనంలో గవర్నమెంట్ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం ద్వారా ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు.