by Suryaa Desk | Thu, Jan 02, 2025, 12:47 PM
మాదాపూర్ లోని ఓ ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయినట్టు కనిపిస్తోంది. ఆసుపత్రిలో చేరే ముందు ఒక మాట, చేరి వైద్యం చేసే ముందు ఒక మాట చెబుతున్న వైద్యులు..చివరకు డబ్బులు చెల్లించే విషయంలో మరో తీరుగా వ్యవహరిస్తుండటంతో కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.మాదాపూర్ లోని ఫేస్ ఆస్పత్రిలో ఓ పేషెంట్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఏంటని విషయాన్ని ఆరా తీయగా… వారు చెబుతున్న విషయం మరో ఠాగూర్ సినిమాలను తలపిస్తోంది. ఆ సినిమాలో మాదిరిగానే రెండు రోజులు క్రితం.. కాలేయ సమస్యతో అన్నపూర్ణ (60) అనే ఓ మహిళ ఆసుపత్రిలో చేరింది. ఆవిడ చేరేటప్పుడు ఒకలా వ్యవహరించిన ఆసుపత్రి యాజమాన్యం.. ఆసుపత్రిలో చేరు ముందు రూ. 2,20,000 కట్టించుకుంది. ఆమెను అత్యవసర విభాగానికి తరలించి చికిత్స మొదలుపెట్టారు.టెస్టుల పేరుతో హడావిడి చేసిన ఆసుపత్రి సిబ్బంది.. ఆవిడ ఆరోగ్యం మెరుగైందని తెలిపింది. అంతే కాదు.. సమస్య పూర్తిగా తొలగిపోయిందని ఇక రేపే డిశ్చార్జ్ అని, సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లొచ్చని హామీ ఇచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇంతలోనే ఆసుపత్రి యాజమాన్యం మాట మార్చేసింది… ఆవిడ ఆరోగ్యం మరోసారి విషమంగా మారిపోయిందని బాంబు లాంటి వార్త చెప్పారు. పరిస్థితి క్రమక్రమంగా క్షిణిస్తుందని, అత్యవసర వైద్యం అందించాలంటూ హడావిడి చేసింది. వైద్య చికిత్స నిమిత్తం మరో రూ. 3 లక్షలు చెల్లించాలంటూ చెప్పారు. దాంతో.. కంగారు పడిన కుటుంబ సభ్యులు డబ్బులు సమకూర్చారు.
వైద్యులు చెప్పినట్లుగానే రూ. 3 లక్షలు తీసుకొని ఆసుపత్రికి వెళ్లారు. డబ్బులు డిపాజిట్ చేసి ముందు పేషెంట్ ఆరోగ్య పరిస్థితి0 గురించి ఆరా తీయగా.. ఆవిడ అప్పటికే మరణించినట్లు వెల్లడించారు. దాంతో.. బోరున విలపిస్తూ ఆవిడ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆసుపత్రి సిబ్బంది అడ్డగించారు. వైద్య ఖర్చుల కింద రూ.3 లక్షలు చెల్లించి మృత దేహాన్ని తీసుకెళ్లాలని తెలిపారు.ఆసుపత్రి యాజమాన్య వ్యవహారంతో కంగుతిన్న కుటుంబ సభ్యులు.. చివర్లో వైద్యం చేసేందుకు రూ.3 లక్షల అవుతాయని చెప్పారని, కానీ ఇప్పుడు శవాన్ని తీసుకెళ్లేందుకు ఎందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఆసుపత్రికి చేరుకుని ఆందోళన నిర్వహిస్తున్నారు. దాంతో.. ఆసుపత్రి నిర్వహకులు బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు. కాక ఈ ఘటనను చూస్తున్నా వారందరికీ అప్పట్లో విడుదలైన ఠాగూర్ సినిమా గుర్తుకొస్తోంది.