by Suryaa Desk | Thu, Jan 02, 2025, 02:34 PM
హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం పక్కన ఉన్న అమరవీరుల స్మారక స్థూపానికి సమతా సైనిక్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి భీమా కోరేగావ్ యుద్ధ అమరవీరులకు బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమతా సైనిక్ దళ్ నాయకులు మాచన్ పల్లి రామస్వామి, ఏర్పుల మల్లేష్ మాట్లాడుతూ.. మరాఠా పీష్వా బ్రహ్మణుల అరాచక, పాశవిక, అణచివేత నుంచి విద్యకు, సమాజానికి, సంపదకు, మానవ హక్కులకు దూరమైన జాతులకు మహార్ యుద్ధ వీరుల వీరోచిత పోరాటంతో స్వేచ్ఛ లభించిందన్నారు.
పీష్వా బ్రహ్మణులపై మహార్ పోరాట యోధుల యుద్ధ విజయానికి చిహ్నమే భీమా కోరేగావ్ అని అన్నారు. 500 మంది మహార్ వీరులకు 28 వేల మంది పీష్వా బ్రహ్మణ సైన్యంతో మహారాష్ట్రలోని పుణే జిల్లాలో గల కోరేగావ్ గ్రామ భీమా నది ఒడ్డున భీకర యుద్ధం చేసి 1818 జనవరి 1న విజయం సాధించారన్నారు. మహార్ పోరాట యోధులు చేసిన పోరాటం మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా అమరుల స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాచన్ పల్లి రామచందర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి మహేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బేగరి ప్రభాకర్, చేవెళ్ల మండల అధ్యక్షులు మల్లెపల్లి శ్రీనివాస్, ఆలూర్ గ్రామ జై భీమ్ యువజన సంఘం అధ్యక్షులు ఎల్లకొండ నర్సిములు, పూలపల్లి ప్రవీణ్ కుమార్, పూలపల్లి తరుణ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.