by Suryaa Desk | Thu, Jan 02, 2025, 08:12 PM
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి వడివడిగా అడుగులుపడుతున్నాయి. ఉత్తర మార్గంలో భూసేకరణ కూడా దాదాపు పూర్తవ్వగా… ఇటీవలనే కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకుంది.ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగంలో 4 లేన్ల ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణ పనులకు టెండర్లను పిలిచింది.ముందుగా… గిర్మాపూర్ నుంచి యాదాద్రి వరకు ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణం జరగనుంది. రూ.7,104 కోట్లతో మొత్తం 161.5 కి.మీ మేర రహదారి నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. రెండేళ్లలో ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు.రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ఉమ్మడి మెదక్ జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. అనేక ప్రాంతాలకు రోడ్డు కనిక్టెవిటీ పెరగటంతో పాటు మౌలిక సదుపాయాలు కూడా పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్ జిల్లాల మీదుగా ఉండనుంది. గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, జగదేవ్‌పూర్ వంటి పట్టణాలకు కనెక్టివిటీ పెరగనుంది.రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పుంజుకునే అవకాశం ఉంది.ఓఆర్ఆర్ - ఆర్ఆర్ఆర్ మధ్య కనిక్టివిటీ రోడ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ మధ్య ప్రాంతంలో అత్యధికంగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.ఉత్తర భాగంలో ప్రతిపాదించిన 11 ఇంటర్‌ఛేంజ్‌లలో… 7 ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కొలువుదీరనున్నాయి.ఈ 7 ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద వివిధ ఆకృతుల్లో రోడ్లను నిర్మించనుండడంతో ఈ ప్రాంత రూపురేఖలు మరింతగా మారిపోతాయి.రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు మరింతగా తగ్గుతాయి. అంతేకాకుండా… ఉమ్మడి మెదక్ జిల్లా నుండి రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు కూడా సులభంగా వెళ్లే అవకాశం ఉంది.
ఉత్తర మార్గానికి లైన్ క్లియర్ కావటం, టెండర్ల పిలవటంతో ఉమ్మడి మెదక్ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు.రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే.. దానివెంట పరిశ్రమలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లు.. ఇలా ఎన్నోనిర్మాణాలు జరుగుతాయని భావిస్తున్నారు. ఫలితంగా ఈ రోడ్డు నిర్మాణం అయ్యే ప్రాంతాల్లో భూముల ధరలకు మంచి డిమాండ్ ఉంటుంది.రీజనల్ రింగ్ రోడ్డు వేగవంతమైన లాజిస్టిక్స్, రవాణాకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పరిశ్రమలు, గిడ్డంగులు, టెక్ పార్కులు వస్తాయి. మరిన్ని వ్యాపారాలు విస్తరిస్తాయి.