by Suryaa Desk | Thu, Jan 02, 2025, 08:19 PM
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో కేసీఆర్ కుటుంబం పెద్ద మొత్తంలో వనరులను దోచుకుందని ఆరోపించారు. కొత్త రకమైన అవినీతికి పాల్పడ్డారన్నారు. మీ కుటుంబంపై అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయని కేసీఆర్‌ను ప్రశ్నించారు.లిక్కర్ కేసులో ఇరుక్కుని కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఎన్ని రోజులు ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. మరోవైపు, ఫార్ములా ఈ కేసులో రేపో మాపో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా జైలుకు వెళ్లబోతున్నారని కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీశ్ రావు అనేక విధాలుగా సాంకేతిక తప్పులు చేశారని మండిపడ్డారు.కల్వకుంట్ల కేసీఆర్ కుటంబమంతా రేపో మాపో జైలులో ఊచలు లెక్కపెట్టబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కడియం శ్రీహరి. మీరు నిజాయితీపరులైతే మీపై ఇన్ని కేసులు ఎందుకు నమోదవుతాయని కేసీఆర్ కుటుంబాన్ని ప్రశ్నించారు. 2014లో కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎన్ని.. ఇప్పుడు ఎన్నో చెప్పాలని డిమాండ్ చేశారు.
అప్పుడు రూ. 10 కోట్ల ఆస్తులు లేని మీకు.. ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు, వందలాది ఎకరాల భూములు ఎలా వచ్చాయని కడియం శ్రీహరి ప్రశ్నించారు. దళితబంధులో కమీషన్ తీసుకున్నవారు.. ఇప్పుడు నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడినవారు నీతులు మాట్లాడటం హాస్యాస్పందంగా ఉందని విమర్శించారు. కడియం శ్రీహరి తప్పు చేస్తే ఆధారాలు చూపించాలని.. ఇకనైనా సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.