by Suryaa Desk | Thu, Jan 02, 2025, 08:28 PM
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తన క్లాస్‌మెట్ అయిన అమ్మాయికి న్యూఇయర్ విషెస్ చెప్పిన ఓ బాలుడు.. సాయంత్రానికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అయితే, అమ్మాయి కుటుంబసభ్యులు అతడిపై దాడి చేయడంతోనే బాలుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. భీమునిమల్లారెడ్డికి చెందిన శివకిశోర్(17) అనే 10వ తరగతి విద్యార్థి.. అదే గ్రామానికి చెందిన తన క్లాస్‌మెట్ అమ్మాయికి న్యూఇయర్ విషెస్ చెప్పాడు. ఈ క్రమంలో శివకిషోర్‌పై విద్యార్థిని కుటుంబసభ్యులు, బంధువులు దాడికి పాల్పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన శివకిశోర్ ఆత్మహత్య చేసుకున్నాడు.శివకిశోర్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబసభ్యులు పరారయ్యారు. అంతకుముందు మృతుడి తల్లికి కూడా అమ్మాయి కుటుంబసభ్యులు బెదిరింపులకు గురిచేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో శివకిశోర్ ఆత్మహత్యకు కారణమైన అమ్మాయి కుటుంబసభ్యులు, బంధువులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. శివకిశోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శివకిశోర్ ఆత్మహత్యతో అతని కుటుంబంతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.