by Suryaa Desk | Sun, Dec 29, 2024, 12:21 PM
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకేరోజు ఇద్దరు కానిస్టేబుళ్ల ఆత్మహత్య కలకలం రేపింది. వేర్వేరు కారణాలతో హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్, కానిస్టేబుల్ బాలకృష్ణ బలవన్మరణానికి పాల్పడ్డారు.మెదక్ జిల్లాలో కొల్చారం పోలీస్ స్టేషన్‌లో సాయి కృష్ణ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున వాకింగ్ కోసం పీస్ వద్దకు వచ్చిన ఆయన అక్కడున్న చెట్టుకు ఉరివేసుకుని చనిపోయారు. ఆయన మృతికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తున్నది. ఈ ఘటనపై రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి విచారణ చేపట్టారు. ఆత్మహత్య చేసుకునే ముందు కుమార్తెకు ఫోన్ చేసినట్లు తెలిసింది. అదేవిధంగా తరచూ చనిపోతానని సాయికుమార్ అనేవారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.ఇక, సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలకుంట కాలనీలో 17వ బెటాలియన్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. భార్యకు నీళ్లలో ఎలుకల మందు, పిల్లలకు పాలల్లో పురుగుల మందు కలిపి ఇచ్చిన బాలకృష్ణ అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆయన మృతిచెందగా, భార్యా పిల్లలు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇంటి కొనుగోలు కోసం స్నేహితుల వద్ద అప్పులు తీసుకున్నట్లు తెలుస్తున్నది.