by Suryaa Desk | Mon, Dec 30, 2024, 07:06 PM
వివిధ సోషల్ మీడియా మాధ్యమాలు పెడ ధోరణులకు వేదికగా మారుతుండడం పట్ల టాలీవుడ్ యువ హీరో నిఖిల్ విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను మంచి కోసం, మంచిని ప్రోత్సహించడం కోసం ఉపయోగిద్దామని తాజాగా పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా సానుకూల దృక్పథాన్ని వ్యాపింపజేద్దామని సూచించారు. ఫేక్ న్యూస్ ను కట్టడి చేద్దామని, ఆన్ లైన్ వేధింపులకు అడ్డుకట్ట వేద్దామని నిఖిల్ పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో చెడ్డ పోస్టులు పెట్టబోమని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని తెలిపారు. "మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఎక్స్ పైరీ డేట్ చెక్ చేస్తాం. కానీ సోషల్ మీడియాలో ఓ న్యూస్ ఫేక్ న్యూసా, ఒరిజినల్ న్యూసా అని ఎందుకు చెక్ చేయడంలేదు? ఆ... ఏముందిలే అని మనం సరదాగా షేర్ చేసే ఆ ఫేక్ న్యూస్ కొన్ని జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే ఓ న్యూస్ ను షేర్ చేసే ముందు, అది నిజమా, కాదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. సోషల్ మీడియాను పది మందికి ఉపయోగపడేలా వాడదాం... ఇబ్బందిపడేలా కాదు" అని నిఖిల్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.