by Suryaa Desk | Tue, Dec 31, 2024, 04:18 PM
విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు టాలెంట్ టెస్ట్ పరీక్షలు ఎంతగానో దోహదపడతాయని చేవెళ్ల మండల విద్యాశాఖ అధికారి పురన్ దాస్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలోని ఎమ్మార్సీ భవనంలో విద్యార్థులకు మండల స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ పరీక్షను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు మండలంలోని దాదాపు అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పదోతరగతి చదివే 48 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్ పరీక్షను ఆయన ప్రారంభించి మాట్లాడారు. టాలెంట్ టెస్టు రాయడం వల్ల వారి సామర్ధ్యం, మెలకువలు తెలుస్తాయన్నారు. విద్యార్థులు భయాన్ని వీడి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఇంగ్లీష్ మీడియం నుంచి దుర్గ భవాని( జడ్పీహెచ్ఎస్ గర్ల్స్, చేవెళ్ల) ప్రథమ, వైష్ణవి(జడ్పీహెచ్ఎస్, అంతారం) ద్వితీయ, పవన్ కుమార్(జడ్పీహెచ్ఎస్, కమ్మెట) తృతీయ స్థానం సాధించారు. తెలుగు మీడియం నుంచి రక్షిత(జడ్పీహెచ్ఎస్ గర్ల్స్, చేవెళ్ల) ప్రథమ, భవాని(జడ్పీహెచ్ఎస్, ఖానాపూర్) ద్వితీయ, నితీష(జడ్పీహెచ్ఎస్, ఖానాపూర్) తృతీయ స్థానం సాధించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీహెచ్ఎస్ అంతారం ప్రధానోపాధ్యాయులు రామారావు, జడ్పీహెచ్ఎస్ తంగడపల్లి ప్రధానోపాధ్యాయులు గోపాల్, సాంఘిక శాస్త్ర మండల కన్వీనర్ అపర్ణ, ఉపాధ్యాయులు సీ రాజు, కే శ్రీకాంత్, కృష్ణ, వెంకటరమణ, వెంకటేష్, రాఘవేందర్, నవనీత, అలివేలు, సుదర్శన్ రెడ్డి లు మండల స్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందించారు.
టాలెంట్ టెస్టులతో ప్రతిభ మెరుగుదల : టీపీయుఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు గణపురం సురధీర్
టాలెంట్ టెస్టులతో విద్యార్థుల్లోని ప్రతిభ మెరుగవుతుందని, పరీక్షలంటే సహజంగా ఉండే భయం పోతుందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయుఎస్) జిల్లా గౌరవాధ్యక్షులు గణపురం సురధీర్ అన్నారు. ఇలాంటి టెస్ట్‌లు భవిష్యత్తులో రాబోయే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఒక అనుభవంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రాబోయే పదవ తరగతి పరీక్షల్లో సాంఘిక శాస్త్రం పరీక్షలో మంచి మార్కులు సాధిస్తారని, దానికి ఈ పరీక్షలు దోహదపడుతాయని అన్నారు. పదవ తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగమన్నారు.