by Suryaa Desk | Tue, Dec 31, 2024, 04:01 PM
చలి తీవ్రత నుంచి నారుమడులను రక్షించుకునే జాగ్రత్తలు రైతులు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నరేష్ అన్నారు. సోమవారం రాయపోల్ మండలం లింగారెడ్డిపల్లి,అనాజీపూర్ గ్రామలలో వరి నారు మడులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత చలి వాతావరణంలో వరి నారుమడులు చలి తీవ్రత వలన ఎరుపుగా మారటం, ఎదుగుదల సరిగ్గా లేకపోవటం వంటివి కనిపించే అవకాశం ఉంది. కావున రైతులు వరి నారును చలి నుంచి కాపాడుకోవడానికి రాత్రి పూట నీళ్లు తీసి ఉదయం వేడి నీరు పెట్టటం ద్వారా నారు మడిని చలి నుంచి కాపాడుకోవచ్చు. అదే విధంగా రోజు ఉదయం నారు పై భాగాన తాడుతో గానీ కర్రతో గాని కదపటం ద్వారా మంచును తొలగించటం ద్వారా నారు ఎరుపు అవ్వటం తగ్గుతుంది.
అదేవిధంగా పాలిథిన్ కవర్ ను నాలుగు కర్రల సయహoతో నారును కప్పి ఉంచటం ద్వారా చలి తీవ్రత నుంచి నారు మడిని కాపాడుకోవచ్చన్నారు. చలి వలన నారు ఎరుపు అవ్వటం ,ఎదుగుదల సరిగ్గా లేకపోవటం జరుగుతుంది. దీని నివారణ కోసం 19.19.19 ను 5 గ్రాములు లీటరు నీటిలో చెలమిన్ జింక్ సల్ఫేట్ ను 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే మంచి ఫలితం పొందవచ్చు. కాండం తొలుచు పురుగు మరియు అగ్గి తెగులు నివారణ కోసం నాటు వేసే వారం ముందు ఒక ఎకర నారుమడికి ఒక కేజీ 3 జి గుళికలు మరియు 20-30 గ్రాముల కార్బెండేజిం కలిపి పలుచగా నీరువున్న నారు మడిలో చల్లి రెండు రోజులు నీరు తీయటం పెట్టడం గానీ చెయ్యవద్దు. దీని ద్వారా నాటు వేసిన 20-30 రోజుల వరకు చీడ పీడలను నివారించవచ్చు ఇలాంటి సస్యరక్షణ చర్యలు చేపడితే నారుమడులను రక్షించుకోవచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రవీణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.