by Suryaa Desk | Tue, Dec 31, 2024, 03:43 PM
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఏమిటంటూ హైకోర్టు... ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది.బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లింపులు జరిగాయని కోర్టుకు ఏసీబీ న్యాయవాది తెలిపారు. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్లు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకే కేటీఆర్‌పై కేసు నమోదు చేశామన్నారు.ఫార్ములా ఈ-ఆపరేషన్స్ సంస్థను ఎఫ్ఐఆర్లో చేర్చారా? అని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఎవరెవరి మధ్య ఒప్పందం జరిగిందని అడిగింది.ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌లో పౌండ్ల రూపంలో రూ.46 కోట్ల చెల్లింపులు జరిగినా ఆర్బీఐ నిబంధనలు పాటించలేదని ఏసీబీ ఆరోపించింది. హెచ్ఎండీఏ నుంచి రూ.10 కోట్లకు మించి చెల్లిస్తే ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఉండాలని పేర్కొంది. కానీ ఎవరి అనుమతు లేకుండానే రూ.54 కోట్లు చెల్లించారని ఏసీబీ పేర్కొంది. ఎన్నికల కోడ్ ఉండగానే రేసు నిర్వహణకు ఒప్పందం చేసుకున్నారని కౌంటర్లో ఆరోపించింది. డబ్బు చెల్లింపులో సెక్రటేరియేట్ బిజినెస్ రూల్స్ పాటించలేదని పేర్కొంది. డబ్బు చెల్లింపు నోట్ ఫైల్లో మంత్రి హోదాలో కేటీఆర్ సంతకం చేసినట్లు తెలిపారు.