by Suryaa Desk | Tue, Dec 31, 2024, 06:53 PM
శంషాబాద్ నుంచి తుక్కుగూడ వయా రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు మీదుగా కొత్తగా ఏరో రైడర్ ఆర్డినరీ బస్సులను ప్రవేశ పెడుతున్నట్టు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. జనవరి 1 నుంచి ఈ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, వివిధ కార్గో, ఫార్మా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వీటి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
రూ.1,150తో నెలవారీ బస్‌పాస్‌తో ఏరో రైడర్‌తోపాటు సిటీ ఆర్డినరీ, సబర్బన్ బస్సుల్లో ప్రయాణించొచ్చునని అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు సందర్శించాలనుకునే వారు ఏరో రైడర్ బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. శంషాబాద్ బస్‌స్టేషన్ నుంచి తుక్కుగూడకు, తుక్కుగూడ నుంచి శంషాబాద్ బస్‌స్టేషన్‌కు ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు ప్రతి గంటకు ఓ బస్సు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మార్గాల్లో ప్రయాణించేవారు వీటిని ఉపయోగించుకోవాలని సూచించారు.
కాగా, తెంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మహాలక్ష్మీ పథకం కింద ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏరో రైడర్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం వర్తిస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు సిటీ ఆర్డీనరీ, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం అందిస్తున్నారు. ఈ బస్సుల్లో జీరో టికెట్ తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణించే అవకాశం కల్పించారు. ఉచిత బస్సు ప్రయాణం అందుబాటిలోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ పెరిగింది. గతంలో రోజుకూ 25 లక్షల మంది ప్రయాణిస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య 55 లక్షలకు పైగా చేరుకుంది.