by Suryaa Desk | Mon, Dec 30, 2024, 02:52 PM
గత మూడు రోజులుగా నల్లబెల్లి మండలంలోని పలు గ్రామాలలో పంట పొలాల్లో పులి అడుగు ముద్రలు లభ్యమైన సంగతి తెలిసిందే. తాజాగా పులి ఆనవాళ్లు నర్సంపేట మండలం లో అధికారులు గుర్తించడం చర్చనీయాంశంగా మారింది. నర్సంపేట సీఐ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... ఆదివారం ఉదయం నర్సంపేట మండలం లో రాజుపేట శివారు జంగాలపల్లి తండా సమీపంలోని పంట పొలాల్లో పులి అడుగులు ఉన్నట్లు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు.
సంఘటనా స్థలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు అవి పులి అడుగు ముద్రలే అని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నర్సంపేట మండల ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మండలంలో పులి సంచరిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాయంత్రం 4 గంటల లోపు పొలాల్లోకి వెళ్లిన అందరు ఇండ్లళ్లకు చేరుకోవాలన్నారు. ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా సమూహంగా వెళ్లాలన్నారు. పశువుల, మేకల కాపలాదారులు అప్రమత్తంగా ఉండాలని నర్సంపేట సీఐ రమణమూర్తి హెచ్చరికలు జారీ చేశారు.