by Suryaa Desk | Sun, Dec 29, 2024, 07:14 PM
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తన కుమారుడి పేరు మీద.. ప్రతీక్ ఫౌండేషన్ స్థాపించి తరచూ ఏదో రకంగా సమాజ సేవ చేస్తూ.. పేద ప్రజల ముఖాల్లో విసిరే చిరునవ్వు్ల్లో తన కుమారున్ని చూసుకుంటుంటారు మంత్రి కోమటిరెడ్డి. ఈ క్రమంలోనే.. ఇటీవల సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించటంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. కాగా.. బాధిత కుటుంబానికి ఫౌండేషన్ తరపును రూ.25 లక్షల నగదుసాయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అందించారు. తాజాగా.. మరో గొప్పపని చేసి తన ఉదారత చాటుకున్నారు.
ఇటలిలోని ప్రఖ్యాత విద్యాసంస్థ పాలిటెన్సికో డి టోరినోలో అర్కిటెక్చర్ కన్‌స్ట్రక్షన్‌లో మాస్టర్స్‌లో సీటొచ్చినా.. వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేని విద్యార్థిని ప్రణవి చొల్లేటి పరిస్థితిని తెలుసుకుని చలించినపోయిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. వెంటనే స్పందించారు. ప్రణవిని ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. ప్రతీక్ ఫౌండేషన్ తరపున వెంటనే లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. తన చదువుకు అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. ఏ అవసరం వచ్చినా తానున్నానని ప్రణవికి కోమటిరెడ్డి భరోసా ఇచ్చారు.
ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థి చదువు ఆగిపోతే.. వారి జీవితం ఆగిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిభ కలిగిన ఏ విద్యార్థి చదువు ఆగిపోకూడదని కోమటిరెడ్డి పేర్కొన్నారు. జీవితాలను మార్చే ఆయుధం చదువు ఒక్కటేనని.. మంత్రి అభిప్రాయపడ్డారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన సాయంపై స్పందించిన ప్రణవి.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంతో అప్యాయంగా మాట్లాడారన్నారు. తామేవరమో తెలియకపోయినా తమ కష్టం తెలుసుకొని.. ఇంటికి పిలిచి స్వీట్లు ఇచ్చి మర్యాద చేశారని చెప్పుకొచ్చారు. తన చదువులకు అండగా ఉంటానని చెప్పారని ప్రణవి ఎమోషనల్ అయ్యారు. అప్పటికప్పుడే ఆర్థిక సహాయం చేసినట్టు తెలిపారు. తన చదువుల బాధ్యత తీసుకుంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట ఇచ్చినట్టు ప్రణవి తెలిపారు. మంత్రి చేసిన సాయంపై ప్రణవి హర్షం వ్యక్తం చేశారు. తనలాంటి ఎంతో మంది పేద విద్యార్థల చదువులకు అండగా నిలబడుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రణవి కృతజ్ఞతలు తెలిపారు.