by Suryaa Desk | Mon, Dec 30, 2024, 07:30 PM
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 24 ఏళ్ల పాటు కష్టపడ్డారని.. ప్రస్తుతం కాస్త రెస్ట్ తీసుకుంటున్నారని.. ఎప్పుడు బయటకు రావాలో ఆయనకు బాగా తెలుసంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి హాజరైన కేటీఆర్.. మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహ రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందోదని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో పీవీ నరసింహ రావుకు మెమోరియల్ కట్టాలని అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయరని ప్రశ్నించారు. మరణంలో కూడా పీవీని కాంగ్రెస్ గౌరవించలేదని ఆరోపించారు. పీవీకి గౌరవం దక్కేవరకు రాజ్యసభలో బీఆర్ఎస్ కొట్లాడుతుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీలు రక్షణ కవచంగా మారారని కేటీఆర్ ఆరోపించారు. అమృత్, సివిల్ సప్లై స్కాంలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ జరపదని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్ జరిగితే.. కేంద్రమే కాపాడుతుందంటూ కీలక ఆరోపణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలకు కేంద్ర ప్రభుత్వమే సహకరిస్తుందన్నారు. 2025లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నికతో పాటు సంస్థాగతంగా కమిటీలు వేస్తామని తెలిపిన కేటీఆర్.. లోకల్ బాడీస్‌లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అంతకుముందు.. అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలుపుతూ కేటీఆర్ ప్రసంగించారు. మాజీ ప్రధాని మాన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి బీఆర్‌ఎస్ తరఫున పూర్తిగా మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలనే ప్రతిపాదనతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నామని తెలిపారు. గొప్ప ఆలోచనకు అరుదైన సందర్భం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మన్మోహన్ సింగ్ హాయాంలోనే తెలంగాణ ఏర్పడిందని గుర్తుచేశారు. కేంద్రంలో ఓబీసీ శాఖను ఏర్పాటు చేయాలని మన్మోహన్ సింగ్‌ను కేసీఆర్ కోరారని తెలిపారు.
మన్మోహన్ సింగ్ గొప్పదనాన్ని, సామర్థ్యాన్ని మొదటిసారిగా గుర్తించింది తెలంగాణ బిడ్డ పీవీ నరసింహా రావు అనేది నిర్వివాదాంశమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. పీవీ నరసింహా రావు దేశ ప్రధానిగా ఎన్నికైన తర్వాత లాటరీ ఎంట్రీ ద్వారా రాజకీయాలతో సంబంధంలేని ఒక ఆర్థిక వేత్తను ఫైనాన్స్ మినిస్టర్‌గా నియమించారన్నారు. కేవలం 15 రోజులు ఫారెక్స్ నిల్వలు ఉన్న నాటి రోజు నుంచి.. ప్రపంచమంతా ఆశ్చర్యపడే స్థాయికి దేశాన్ని పరుగెత్తించిన ఆర్థిక సంస్కరణల శీలి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. అనవసరపు డాంభికాలు, ఆర్భాటాలు, హడావుడి లేకుండా.. సింపుల్ లివింగ్.. హై థింకింగ్ అనే మాటకు పర్యాయపదంగా మన్మోహన్ సింగ్ తన ప్రయాణాన్ని కొనసాగించారు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలోనే కేసీఆర్.. ఏడాదిన్నర పాటు కేంద్ర మంత్రిగా పనిచేసినట్టుగా కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిబద్ధత, ఉద్యమానికి ఉన్న బలం, తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తి.. అన్నీ ఆయనకు అర్థమయ్యాయి కాబట్టే అనివార్య పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పడిందని.. దాన్ని తాము మర్చిపోమని చెప్పుకొచ్చారు.
ఎన్నో అడ్డంకులు, ఎన్నో అభ్యంతరాలున్నా మన్మోహన్ సింగ్ మాత్రం ప్రజా ఉద్యమాలకు అండగా నిలబడ్డారని కేటీఆర్ గుర్తుచేశారు. ఎన్నడూ కూడా, ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా సంస్కరణల బాట నుంచి వెనక్కి తగ్గలేదన్నారు. మన్మోహన్ సింగ్‌ను సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడ్రన్ ఇండియా అని పిలువొచ్చన్నారు. అవమానం చేస్తే ఆకాశం స్థాయి తగ్గదని.. ఎన్ని నిందలు వేసినా మహోన్నతులు వణకరు, బెనకరని.. అలాంటి స్థితప్రజ్ఞతను మన్మోహన్ సింగ్‌లో చూశామని కేటీఆర్ కొనియాడారు.