by Suryaa Desk | Mon, Dec 30, 2024, 07:25 PM
గత కొంత కాలంగా తిరుమల కొండపై శ్రీవారి దర్శనాల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని.. తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తమకు తిరుమలలో అవమానం జరుగుతోందని.. పలువురు తెలంగాణ ప్రజా ప్రతినిధులు మీడియా ముందు వాపోయిన సంగతి చూస్తూనే ఉన్నాం. అయితే ఈ విషయంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాలోచనలు చేస్తుండగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. ఇక నుంచి తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అంగీకరిస్తామని స్పష్టం చేశారు. సీఎంతో భేటీ తర్వాత.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయాన్ని తెలిపారు.
తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రుల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయిన బీఆర్ నాయుడు.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే సిఫార్సు లేఖలు తీసుకునేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు బీఆర్ నాయుడు వెల్లడించారు. వారానికి 4 సిఫార్సు లేఖలను అనుమతించాలని చెప్పినట్లు తెలిపారు. వారానికి 2 బ్రేక్ దర్శనాలు.. మరో రెండు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన లేఖలు అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అనుమతి ఇచ్చారని బీఆర్ నాయుడు వెల్లడించారు.
తిరుమలలో సిఫార్సు లేఖల అంశంపై.. ఇటీవల తెలంగాణకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు ప్రస్తావించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోపాటు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కొందరు నేతలు ఈ అంశాన్ని లేవనెత్తారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు.. ఇటీవల టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు ఒక విజ్ఞప్తి చేయగా.. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే ఈ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల వ్యవహారంపై.. సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ భేటీ అయి చర్చించారు.