by Suryaa Desk | Mon, Dec 30, 2024, 07:20 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ఈ ఘటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తప్పు పట్టాల్సిన పని లేదని.. ఆయన కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. కరీనంగర్‌లో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై హాట్ కామెంట్స్ చేశారు. "పవన్ కళ్యాణ్ ఏమన్నారో నాకు తెలియదు. నేను వినలేదు. నిజంగా గొప్ప నాయకుడని అని ఉంటే.. ఆయనలో మరి ఏం కన్పించిందో.. 6 గ్యారంటీలను అమలు చేయలేదు. ఇచ్చిన హామీలను ఏవీ అమలు చేయలేదు..? క్రైం రేటు పెరిగింది. మరి ఆయనలో గొప్ప నాయకుడు ఎట్లా కన్పించారో వారికే తెలియాలి. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు గొప్పో.. ఏ విషయంలో గొప్పగా కనిపించారో పవన్ కళ్యాణ్‌కే తెలియాలి." అంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదే క్రమంలో రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ పలు ఆరోపణలు చేశారు. పుష్ప -2 సినిమా కలెక్షన్లలో రేవంత్ రెడ్డికి 14 శాతం వాటా ముట్టిందేమోనన్న అనుమానం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎందుకు పెట్టారంటే.. అల్లు అర్జున్ కోసమే అన్నట్లుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. అల్లు అర్జున్‌కు రేవంత్ రెడ్డికి ఎక్కడో చేడిందని.. ఆ 14 శాతం వాటా దగ్గరే కావొచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి గురించి ఇంతగా అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఏంటని బండి సంజయ్ నిలదీశారు.
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టయి జైలుకు పోయి బెయిల్ మీద బయటకు కూడా వచ్చాడని బండి సంజయ్ తెలిపారు. ఆ అంశం అక్కడే ముగిసిందని.. కానీ మళ్లీ అసెంబ్లీలో మరే సమస్య లేనట్లు ఈ అంశంపై గంటల తరబడి చర్చ జరపాల్సిన అవసరం ఏముందని మండిపడ్డారు. 6 గ్యారంటీలపై చర్చ జరగకుండా దారి మళ్లించాలనే కుట్రలో భాగమేనని ఆరోపించారు. తనకు తెలిసి రేవంత్ రెడ్డికి, అల్లు అర్జున్‌కు మధ్య ఏదో చెడిందన్నారు. పుష్ప 2 సినిమాకు రూ.1700 కోట్లు వచ్చాయన్న బండి సంజయ్.. పుష్ప 3 సినిమా ఇంకా మొదలే కాలేదు.. కానీ పుష్ప-3 సినిమా చూపించారంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బిల్లు మంజూరు చేయాలన్నా 8 నుంచి 14 శాతం కమీషన్లు దండుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు. కమీషన్లు దండుకునేందుకే ప్రత్యేకంగా ముగ్గురు మంత్రులను పెట్టుకున్నారని.. 14 శాతం కమీషన్లు ఎవరైతే ఇస్తారో... వాళ్లకే బిల్లులు మంజూరవుతున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కేబినెట్‌లో కొందరు నిజాయితీ మంత్రులున్నారని, వారికి ఈ విషయం ఏ మాత్రం నచ్చడం లేదన్నారు. ఈ కమీషన్ల విషయంలో కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం నడుస్తోందని.. ఎప్పుడైనా ఈ కమీషన్ల భాగోతం బద్దలు కావొచ్చన్నారు. కమీషన్ల మోజులో పడి ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు కప్పం కడుతూ తమ సీటును కాపాడుకోవడానికే కాంగ్రెస్ పాలకులు పరిమితమయ్యారే తప్ప ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు.
తెలంగాణలో 22 శాతం క్రైం రేటు పెరిగిందని.. మహిళలపై అత్యాచారాలు 28 శాతం పెరిగాయన్నారు. శాంతి భద్రతలను కాపాడాలేని చేతగాని సర్కార్ నడుస్తోందని మండిపడ్డారు. వీళ్లకు ప్రజల బాధలు పట్టవు.. ఢిల్లీకి పోయి కప్పం కట్టి పదవులను కాపాడుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజలను ఆదుకోవాలని లేదు... 6 గ్యారంటీలను అమలు చేయాలనే ధ్యాస లేదన్నారు.