by Suryaa Desk | Sun, Dec 29, 2024, 06:08 PM
పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన నేపథ్యంలో... హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ యాజమాన్యానికి చిక్కడపల్లి పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై నమోదైన కేసులో థియేటర్ మేనేజ్ మెంట్ వ్యక్తులను కూడా నిందితులుగా పేర్కొన్నారు. కాగా, పోలీసుల నోటీసులపై సంధ్య థియేటర్ యాజమాన్యం సమాధానమిచ్చింది. తమ న్యాయవాదుల ద్వారా చిక్కడపల్లి పోలీసులకు లేఖను పంపింది. తమ థియేటర్ కు అన్ని అనుమతులు ఉన్నాయని ఆ లేఖలో స్పష్టం చేసింది. 45 ఏళ్లుగా థియేటర్ నిర్వహిస్తున్నామని, గతంలో ఎప్పుడూ ఇటువంటి ఘటన చోటుచేసుకోలేదని వెల్లడించింది. డిసెంబరు 4వ తేదీ రాత్రి పుష్ప-2 ప్రీమియర్ షో ప్రదర్శిస్తున్న సమయంలో థియేటర్ లో 80 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారని తెలిపింది. డిసెంబరు 4, 5 తేదీల్లో సంధ్య థియేటర్ ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎంగేజ్ చేసుకుందని వివరించింది. గతంలో అనేక సినిమాల విడుదల సమయంలో ఆయా చిత్రాల హీరోలు తమ థియేటర్ కు వచ్చారని వెల్లడించింది. థియేటర్ కు వచ్చే వారి కోసం కార్లు, బైక్ లకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కూడా ఉందని తెలిపింది. ఈ మేరకు పోలీసులకు ఆరు పేజీల లేఖతో సంధ్య థియేటర్ మేనేజ్ మెంట్ సమాధానమిచ్చింది