by Suryaa Desk | Mon, Dec 30, 2024, 05:33 PM
హమాలి కార్మికుల కొరకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30 న సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు హమాలి కార్మికులందరూ పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని ములుగు మండల సిఐటియు నాయకులు ఎర్రోళ్ల మల్లేశం పిలుపునిచ్చారు. ఒంటిమామిడి మార్కెట్ హమాలి కార్మికులతో కలిసి హమాలి వెల్ఫేర్ బోర్డు సాధనకై సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయడం కోసం కరపత్రం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీ కార్మికులకు పని ప్రదేశాల్లో అనేక సందర్భాలలో ప్రమాదాలు జరిగి కాళ్లు, చేతులు విరిగి పోవడం, ప్రాణాలు కూడా కోల్పోతున్న సందర్భాలు ఉంటున్నాయని, ఇలాంటి కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హమాలి కార్మికులకు గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా, ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాడ్యుటి, పెన్షన్ లాంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ గోదాముల లోని హమాలి కార్మికులను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, పని ప్రదేశాలలో కనీస మౌలిక వసతులు కల్పించాలని, కార్మికులందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.