by Suryaa Desk | Mon, Dec 30, 2024, 10:34 AM
న్యూఇయర్ వేడుకలపై రాష్ట్రంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించకూడదని తెలిపారు. అర్ధరాత్రి కేక్ కటింగ్, మద్యం సేవించడం, డీజేలు, బైక్-కార్ రేసింగ్, అశ్లీల నృత్యాలు నిర్వహించకూడదని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని వెల్లడించారు.అటు, జూబ్లీహిల్స్‌లో మొత్తం 36 పబ్‌లు ఉండగా.. ఇందులో నాలుగింటికి పోలీసులు అనుమతులు నిరాకరించారు. హార్డ్ కప్, అమ్నేషియా, బ్రాడ్ వే, బేబీలాన్ పబ్‌లకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గతంలో ఆయా పబ్‌ల్లో జరిగిన గొడవలు, పోలీస్ కేసుల కారణంగా ఆంక్షలు విధిస్తూ అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అర్ధరాత్రి ఒంటి గంటలోగా వేడుకలు ముగించుకోవాలని తెలిపారు. మద్యం సేవించిన కస్టమర్లు వాహనాలు నడపడానికి అనుమతించకూడదని.. నిబంధనలు పాటించకుంటే సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మద్యం సేవించిన వారి ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
మరోవైపు, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి దాటాక ఓఆర్ఆర్‌తో పాటు అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్శిటీ ఫ్లైఓవర్లు, షేక్ పేట్, మైండ్ స్పేస్, రోడ్ నెం.45 ఫ్లైఓవర్, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్ JNTU ఫ్లైఓవర్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్‌ను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ మూసివేయనున్నారు.