by Suryaa Desk | Sun, Dec 29, 2024, 07:18 PM
తెలంగాణలో పోలీసుల వరుస ఆత్మహత్యలు సర్వత్రా సంచలనంగా మారాయి. ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌తో పాటు మరో యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారగా.. ఆదివారం (డిసెంబర్ 29న) ఒకే రోజు ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా ఆత్మహత్య చేసుకోవటం ఆందోళన కలిగిస్తోంది. పోలీసుల వరుస ఆత్మహత్యల ఘటనలు ప్రస్తుతం.. ఆందోళన రేకెత్తిస్తున్న నేపథ్యంలో వీటిపై డీజీపీ జితేందర్ స్పందించారు. 2024 సంవత్సరంలో నమోదైన క్రైం రేటుకు సంబంధించి వార్షిక నివేదికను విడుదల చేసిన డీజీపీ జితేందర్ రెడ్డి.. పోలీసుల ఆత్మహత్యలపై కూడా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏడాది మాత్రమే కాదని.. ప్రతి సంవత్సరం ఏదో ఒక కారణంతో పోలీసులు సూసైడ్ మరణాలు చోటుచేసుకుంటున్నాయని డీజీపీ జితేందర్ అభిప్రాపడ్డారు. ఆర్థిక సంబంధిత వ్యవహారాలు, వ్యక్తిగత ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో పోలీసులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ అభిప్రాయపడ్డారు. కొన్ని కేసుల్లో పని ఒత్తిడి వల్ల కూడా ఆత్మహత్య లు చేసుకుంటున్నారని డీజీపీ వెల్లడించారు. పోలీసులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని డీజీపీ తెలిపారు.
క్రైమ్ రేట్‌పై వార్షిక నివేదికను విడుదల చేసిన డీజీపీ జితేందర్ సంచలన వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది కేసుల నమోదు పెరిగిందని డీజీపీ తెలిపారు. గతేడాదితో పోలీస్తే ఈసారి క్రైం రేటు 9.87 శాతం పెరిగిందని వెల్లడించారు. డ్రగ్స్ రహిత తెలంగాణే పోలీసు శాఖ లక్ష్యమని డీజీపీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 142.95 కోట్లు మాద్రకద్రవ్యాలను సీజ్ చేశామని.. ఇప్పటివరకు 4682 మంది నిందితులను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. మోసాలకు పాల్పడుతున్న 1800 వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 33,618 సైబర్ క్రైం కేసులు నమోదు చేసినట్టు డీజీపీ తెలిపారు. ఈ కేసుల్లో రూ.180 కోట్లను బాధితులకు తిరిగి అప్పగించామన్నారు. 703 దొంగతనం కేసులో, 58 దోపిడీ, 1525 కిడ్నాప్, 856 హత్య, 2945 లైంగిక దాడుల కేసులు నమోదు చేశామని చెప్పుకొచ్చారు.
డయల్ 100కు ఏకంగా 16,92,173 కంప్లైంట్స్ వచ్చాయని డీజీపీ పేర్కొన్నారు. కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపిన డీజీపీ.. డిజిటల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత 85,190 కేసులను నమోదు చేసినట్టు తెలిపారు. కొత్త చట్టాల ప్రకారం సైబరాబాద్ పరిధిలో 15,360 కేసులు, హైదరాబాద్‌లో 10,501, రాచకొండలో 10,251 కేసులు నమోదైనట్టు వివరించారు. . అని డీజీపీ జితేందర్ వివరించారు.
చట్టవిరుద్దమైన ప్రైవేట్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు. సోషల్ మీడియాపై ప్రత్యేక మానిటరింగ్ ఏర్పాటు చేశామన్నారు. సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ పేరుతో సోషల్ మీడియా ప్రచారాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేసులు పోలీసులు మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేస్తారని.. ప్రైవేట్ వ్యక్తులకు ఎవరికి సంబంధం ఉండదని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు.