by Suryaa Desk | Mon, Dec 30, 2024, 01:07 PM
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏటా జనవరి 1 నుంచి మొదలయ్యే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) ఈసారి కాస్త ఆలస్యంగా ప్రారంభం కానున్నది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ మరణం నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 3 నుంచి నుమాయిష్ మొదలవుతుందని, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి డాక్టర్ బి. ప్రభాశంకర్ వెల్లడించారు.ఎగ్జిబిషన్ మైదానంలోని గాంధీ సెంటినరీ హాల్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈసారి ప్రవేశ రుసుమును రూ.40 నుంచి రూ.50కి పెంచామని, సీనియర్ సిటిజన్ల కోసం వీల్‌చైర్లను అందుబాటులో ఉంచుతున్నామని, జనవరి 7న ఎగ్జిబిషన్‌లో మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తామని వివరించారు. సందర్శకులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించనున్నామని, అందులో భాగంగా 100 సీసీ కెమెరాలను, వాచ్ టవర్లను ఏర్పాటు చేశామని చెప్పారు.