by Suryaa Desk | Sun, Dec 29, 2024, 02:10 PM
పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో ఈ రోజు రైమ్స్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో ప్రీ ప్రైమరీ విద్య అనేది అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ముఖ్యంగా నర్సరీ, ఎల్ కె జి మరియు యుకెజి తరగతుల్లో టీచర్లు బోధించిన అంశాలు సరిగ్గా నేర్చుకుంటే వారు ముందు తరగతుల్లో ఇంకా బాగా రాణించే అవకాశం ఉందన్నారు. రోజూ పుస్తకాలతో కుస్తీ పట్టి, చదివి చదివి అలిసిపోయిన మీ, మా చిన్నారుల మానసిక ఆనందం కోసం ఈ రోజు మా పాఠశాల ఆవరణలో రైమ్స్ ఫెస్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ స్థాయిలో రైమ్స్ నేర్పడం వలన పిల్లలలో జ్ఞాపక శక్తి, విషయ గ్రహణ శక్తి, హావభావాలు, వివిధ పదాలు, వాటిని పలికే విధానం, సభ్యత - సంస్కారం, పెద్దలతో ప్రవర్తించే విధానం తదితర అంశాలు సులభంగా నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం రైమ్స్ ని నేర్పించడం ద్వారా పిల్లలకు సరదాతో పాటు వారికి తెలియకుండానే భాషాపరమైన అంశాల్లో పట్టు సాధించి, వారిలోని భయం తొలగి వారు తమ భవిష్యత్ లో మరింతగా రాణించే అవకాశం ఉందన్నారు. రైమ్స్ ఫెస్ట్ ని విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రీ ప్రైమరీ టీచర్లను ఈ సందర్భంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో చిన్నారులు చిన్న చిన్న పదాలతో, ముద్దు ముద్దు మాటలతో చేసిన ఉపన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు పఠించిన భగవద్గీత శ్లోకాలు అందరినీ మంత్రముగ్దులను చేశాయి. రంగురంగుల వేషధారణలో వచ్చిన విద్యార్థినీ విద్యార్థులు తమ బుడి బుడి అడుగులతో ఇంగ్లీష్ , హిందీ మరియు తెలుగు రైమ్స్ కి అనుగుణంగా చక్కని హావభావాలతో నృత్యం చేయడం చూసి ఆహుతులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్, ఉపాధ్యాయ బృందం, పోషకులు పాల్గొన్నారు.