by Suryaa Desk | Mon, Dec 30, 2024, 03:30 PM
మన్మోహన్ సింగ్ హయాంలోనే విప్లవాత్మక భూసేకరణ చట్టం వచ్చిందని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. ‘‘దేశ క్షేమం దృష్ట్యా మన్మోహన్ సింగ్ న్యూక్లియర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు. రైతులకు రుణమాఫీ చేసిన తొలి ప్రధాని మన్మోహన్ సింగ్. సోనియా గాంధీ సూచనల మేరకు ఆయన గొప్ప చట్టాలు తెచ్చారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది. ప్రభుత్వంలో ఉన్నవారు జవాబుదారీగా ఉండాలని సమాచార హక్కు చట్టం తీసుకొచ్చారు. ప్రజల సొమ్ముతో చేసిన పనుల వివరాలు తెలుసుకొనే హక్కు దీని ద్వారా లభించింది. ఆకలి చావులు ఉండకూడదని ఆహార భద్రత చట్టం తెచ్చారు’’ అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు.దేశాభివృద్ధికి మన్మోహన్ సింగ్ అనేక గొప్ప విధానాలు తీసుకొచ్చారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తుచేసుకున్నారు. ఆయన సాధారణ స్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారని కొనియాడారు. మన్మోహన్‌ను ఆర్థికమంత్రిగా అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఎంపిక చేశారని గుర్తు చేశారు. గ్రామీణ పేదలకు పని కల్పించే ఉపాధి హామీ పథకాన్ని మన్మోహన్ తెచ్చారని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ పటిష్ఠంగా ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు. సామాన్య ప్రజలకు ఆయుధమైన ‘ఆర్టీఐ’, ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ‘ఆధార్’ తెచ్చారన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో రాష్ట్రాల్లో ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేశారని వివరించారు. తెలంగాణ ఏర్పాటులో ఆయన క్రియాశీల పాత్ర పోషించారని శ్రీధర్‌బాబు చెప్పారు.