by Suryaa Desk | Sun, Dec 29, 2024, 09:25 PM
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు ఆర్‌సీ యువశక్తి ఆధ్వర్యంలో విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్‌ను ఆవిష్కరించారు. 256 అడుగుల ఎత్తైన ఈ కటౌట్ లాంచ్ ఈవెంట్‌కు దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ... "గేమ్ చేంజర్ ట్రైలర్ నా ఫోన్‌లో ఉంది. కానీ అది మీ (ఆడియెన్స్) వద్దకు రావాలంటే ఇంకా మేం చాలా పని చేయాల్సి ఉంది. ఇప్పుడు ట్రైలర్‌లే సినిమా స్థాయిని నిర్ణయిస్తున్నాయి. అందుకే ఈ ట్రైలర్‌ను కొత్త ఏడాది సందర్భంగా అంటే జనవరి 1న మీ ముందుకు తీసుకువస్తున్నాం. సినిమా అంటేనే విజయవాడ. ఇక్కడ రామ్ చరణ్ భారీ కటౌట్‌ను రివీల్ చేయడం ఆనందంగా ఉంది. చిరంజీవి గారి మీద 40, 50 ఏళ్ల నుంచి మీ అభిమానం అలానే ఉంటోంది. చిరంజీవి నుంచి మనకు పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, బన్నీ, సాయి ధరమ్ తేజ్ ఇలా చాలా మందిని అందించారు. ఇలా అందరికీ మెగా ఫ్యాన్ సపోర్ట్ ఉంటూనే వస్తోంది. ఇక గేమ్ చేంజర్ సినిమా విషయానికొస్తే... సినిమా చూస్తున్నంత సేపు పరిగెడుతూనే ఉంటుంది. ఏ సీన్ కూడా నిరాశపర్చదు. సినిమాలో అన్ని అంశాలు ఉంటాయి... అదే సమయంలో ఊహించని విధంగా ఉంటుంది. ఎస్ జే సూర్య, రామ్ చరణ్ సీన్లతో థియేటర్లు దద్దరిల్లుతాయి. జనవరి 1న ట్రైలర్ రానుంది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే డేట్‌ను బట్టి జనవరి 4 లేదా 5 ఏపీలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తాం. జనవరి 10న సినిమా రాబోతోంది. ఈ సంక్రాంతిని గట్టిగా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి" అని దిల్ రాజు పేర్కొన్నారు.